Minister Sridhar Babu : పరామర్శలో మంత్రి శ్రీధర్ బాబుకు చేదు అనుభవం
ఇటీవల హత్యకు గురైన జగిత్యాల కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి(Maru Ganga reddy) కుటుంబానికి మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పరామర్శించారు
దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల హత్యకు గురైన జగిత్యాల కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి(Maru Ganga reddy) కుటుంబానికి మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పరామర్శించారు. పరామర్శ సందర్భంగా గంగారెడ్డి కుటుంబ సభ్యుల నుంచి మంత్రి శ్రీధర్ బాబుకు చేదు అనుభవం ఎదురైంది. మృతుని సోదరి రాధ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే మా సోదరుడు హత్యకు గురయ్యాడని, రాజకీయ కక్షలకు బలయ్యాడని వాపోయింది. మేం గెలిపిస్తేనే రేవంత్ సీఎం అయ్యాడంటూ, మా నోరు మూయకండని రాధ మండిపడింది. నిందితుడి పట్ల పోలీసుల వ్యవహారశైలీ అతడేదో వాళ్ల చుట్టమన్నట్లుగా ఉందని ఆరోపించారు. హత్య జరిగాక ఇప్పుడు ఇంటి వద్ద 60 మంది పోలీసులు అవసరమా అని రాధ నిలదీసింది. గత గవర్నమెంట్‌లో మంచిగా ఉన్నామని.. మన గవర్నమెంట్ వచ్చాక భయపడి బ్రతుకుతున్నాం అంటూ గంగారెడ్డి కుటుంబ సభ్యులు అగ్రహం వెళ్ళగక్కారు. మా జీవన్ రెడ్డి అన్న వెంట 30ఏండ్లకు పైగా ఉన్నామని ఎప్పుడు ఈ తరహా రాజకీయాలు చూడలేదన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు వెంట విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గంగారెడ్డి హత్య వెనుక ఏదైనా రాజకీయ కారణం ఉందా అనే అనుమాలు కాంగ్రెస్ నేతలు, శ్రేణులకు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ డీజీపీ, ఎస్పీ లతో మాట్లాడటం జరిగిందన్నారు. బాలికలకు ఏర్పాటు చేసిన టాయిలెట్స్ గోడలకు నీరు పట్టేందుకు వెళ్లిన గంగారెడ్డి హత్యకు గురి కావడం బాధాకరమన్నారు. హత్య వెనుక ఉన్న కారణాలేంటి అనే అంశాలపై ప్రభుత్వం విచారణ చేయిస్తోందన్నారు. మనస్తాపం చెందిన కాంగ్రెస్ శ్రేణులు ధైర్యంగా ఉండాలని, పార్టీ పక్షాన, ప్రభుత్వం తరఫున బాధితుని కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి శ్రీధర్ బాబు భరోసానిచ్చారు.