పొంగులేటిపై ఈడీ దాడి పిరికిపంద చర్యే... బీజేపీపై మంత్రి సీతక్క మండిపాటు

రాష్ట్ర రెవెన్యూ, ఐఅండ్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై దాడిని పిరికిపంద చర్యగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) అభివర్ణించారు.

Update: 2024-09-27 17:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర రెవెన్యూ, ఐఅండ్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై దాడిని పిరికిపంద చర్యగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) అభివర్ణించారు. తన సహాచర మంత్రిపై జరిగిన దాడిని శుక్రవారం ఆమె ఖండించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష ప్రభుత్వాలున్న చోట బీజేపీ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందని ఆగ్రహించారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలను లొంగదీసుకునేందుకు ఈడీని వినియోగిస్తుందన్నారు. ప్రతిపక్ష ప్రభుత్వాలను కులగొట్టడాన్నే మొదటి నుంచి బీజేపీ పనిగా పెట్టుకుందన్నారు. గట్టిగా మాట్లాడిన అపోజిషన్ ఎంపీల ఇళ్ల మీదకు ఈడీని పంపిస్తామని పార్లమెంట్ సాక్షిగానే బీజేపీ ఎంపీలు మాట్లాడటం చూస్తున్నామన్నారు. తమకు అనుకూలంగా, భారత రాజ్యాంగానికి విరుద్ధంగా దర్యాప్తు సంస్థలను వాడుకుంటుందని.. కేంద్ర దర్యాప్తు సంస్థలను పచ్చిగా వినియోగిస్తున్నదని ఆమె మండిపడ్డారు. అందులో భాగంగా తమ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై ఈడీ దాడి జరిగిందని చెప్పారు. ప్రభుత్వంలో ఆయన బలంగా పనిచేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలను బలంగా ప్రజలకు తీసుకెళుతున్నారన్న కారణంతోనే పొంగులేటి మీద ఈడీ, దాడి చేసిందన్నారు. ఈ దాడీని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బీజేపీ తమను రాజకీయంగా ఎదుర్కోవాలని.. ఆర్థికంగా దెబ్బతీసే కార్యక్రమాలు మానుకోవాలన్నారు. ప్రతిపక్ష నేతల నైతిక దైర్యాన్ని దెబ్బతీసే కుట్రలను మోడీ, అమిత్ షా, అదానీలు, అంబానీలు మానుకోవాలని సూచించారు.


Similar News