మంత్రి సీతక్క ఎమోషనల్.. వారిచేత ప్రమాణం

వ‌యోవృద్ధులు భారం కాదని.. మ‌న బాధ్య‌త అని.. కన్న బిడ్డ‌ల‌ను చూసుకున్న‌ట్లుగానే, క‌న్న త‌ల్లిదండ్ర‌లను చూసుకోవాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Update: 2024-09-29 15:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వ‌యోవృద్ధులు భారం కాదని.. మ‌న బాధ్య‌త అని.. కన్న బిడ్డ‌ల‌ను చూసుకున్న‌ట్లుగానే, క‌న్న త‌ల్లిదండ్ర‌లను చూసుకోవాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అంత‌ర్జాతీయ వ‌యోవృద్ధుల దినోత్స‌వం సంద‌ర్బంగా నెక్లెస్ రోడ్‌లోని జ‌ల‌విహార్ పార్క్‌లో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదివారం రాష్ట్ర స్థాయి అవ‌గాహ‌న‌ ర్యాలీ నిర్వ‌హించింది. తెలంగాణ వికలాంగులు వయవృద్ధులు ట్రాన్స్ జెండర్లు సాధికారత శాఖ ఆధ్వర్యంలో చేప‌ట్టిన ర్యాలీకి మంత్రి సీత‌క్క ముఖ్య అతిధిగా హ‌జ‌ర‌య్యారు. వృద్ధులు భారం కాదు.. మ‌న బాధ్య‌త అంటూ ప్ల‌కార్డుతో ర్యాలీని సీత‌క్క ప్రారంభించారు. వ‌యో వృద్ధుల సంర‌క్ష‌ణ అంద‌రి బాధ్య‌త అంటూ ప్రతిజ్ఞ చేయించారు.

ఐక్యరాజ్య స‌మితి పిలుపు మేర‌కు ఏటా అక్టోబ‌ర్ 1న అంత‌ర్జాతీయ వ‌యోవృద్ధుల దినోత్స‌వం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో వ‌యోవృద్ధుల సంర‌క్ష‌ణ‌, హ‌క్కులు, చ‌ట్టాల‌పై ఈ నెల 25 నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వం అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. అందులో భాగంగా జ‌ల‌విహార్ పార్క్‌లో చేప‌ట్టిన ర్యాలీని మంత్రి సీత‌క్క ప్రారంభించి ప్ర‌సంగించారు. వ‌యోవృద్ధుల సంర‌క్ష‌ణ‌ను విస్మ‌రించినా, వారి చ‌ట్టాల‌ను ఉల్ల‌ఘించినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఎలాంటి ఇబ్బందులున్నా త‌మ శాఖ‌ను సంప్రదించాల‌ని కోరారు. పిల్లల్ని కనిపించి ప్రయోజకులను చేసిన వ‌యో వృద్ధులు అంద‌రికీ ఆద‌ర్శ‌నీయులన్నారు. వ‌య‌సు మీద ప‌డిన వారిని వ‌యోవృద్ధులు అన‌డం కంటే పెద్ద‌లు అని పిల‌వ‌డ‌మే స‌మంజ‌స‌మ‌న్నారు. క‌న్న పిల్ల‌ల యోగ‌క్షేమాలు చూసుకున్న‌ట్టుగానే , క‌న్న త‌ల్లిదండ్రుల యోగ‌క్షేమాల్ని చూసుకోవాల‌ని కోరారు.

ఒక‌ప్పుడు ఇల్లు చిన్న‌దైనా మూడు తరాలు ఒకే ఇంట్లో నివ‌సించేవ‌ని గుర్తు చేసారు. కానీ ఇప్పుడు పెద్ద భ‌వ‌నాలు, విశాల ఫార్మ్ హౌస్ ల్లోకి నివాసాలు మారినా.. ఉమ్మ‌డి కుటుంబాలు క‌నుమ‌రుగువుతున్నాయ‌ని తెలిపారు. ఇండ్లు విశాల‌మ‌వుతూ కుటుంబం చిన్న‌గ‌వ‌డం సమాజానికి చేటని పేర్కొన్నారు. ఉన్నత ఉద్యోగాలు చేస్తూ కూడా తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో చేర్చించ‌డం ప‌ట్ల మంత్రి సీత‌క్క ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కన్న తల్లిదండ్రులను స‌రిగా చూసుకోనప్పుడు డబ్బుకు, హోదాకు విలువ ఏం ఉంటుంద‌ని ప్రశ్నించారు. సొంత పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రుల బాగోగులను ప‌ట్టించుకోవాల‌ని కోరారు. వ‌య‌సు మీద ప‌డిన‌ పెద్ద‌ల్ని చిన్న పిల్లల వ‌లే సాకాల్సి వ‌చ్చినా, వారి సంర‌క్ష‌ణ‌ను భాద్య‌త‌గా స్వీక‌రించాల‌న్నారు. ఆస్తుల‌ కోసం కొంద‌రు క‌న్న తల్లిదండ్రుల హ‌త్య‌లు చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వృద్దాశ్ర‌మాలు ఏర్పాటు చేయ‌డం త‌మ ప్ర‌భుత్వ విధానం కాన‌ప్ప‌టికీ క‌న్న పిల్ల‌లు గాలికి వ‌దిలేస్తున్న వ‌యోవృద్ధుల సంర‌క్ష‌ణ‌, సంక్షేమం కోసం గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ఓల్డ్ ఏజ్ హోమ్ ల‌ను పెంచాల్సి వ‌స్తుందని చెప్పారు.

పిల్ల‌లు వ‌దిలేసిన వ‌యోవృద్ధులను త‌మ‌ ప్ర‌జా ప్ర‌భుత్వం అక్కున చేర్చుకుంటుందని భ‌రోసా ఇచ్చారు. ప్రతి జిల్లాలో ఓల్డ్ ఏజ్ హోమ్ ల‌తో పాటు డే కేర్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. వయవృద్ధుల సంరక్షణ కోసం 2007లో నాటి యూపీఏ ప్రభుత్వం వ‌యోవృద్దుల పోషణ, సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేసారు. ఆ చ‌ట్టాన్ని ఉల్ల‌ఘింస్తే శిక్ష‌లు త‌ప్ప‌వని మంత్రి సీత‌క్క‌ హెచ్చ‌రించారు. ఆస్తులు అంతస్తులు కాదు, పెద్దలపై ఆప్యాయత అనురాగాలు ముఖ్యమ‌న్న సీత‌క్క‌, వ‌యోవృద్దుల ఆలోచ‌న‌లు, ఆనుభ‌వాల ఆదారంగా వారి సంర‌క్ష‌ణ కోసం మ‌రిన్ని ప‌థ‌కాలు రూపొందిస్తామ‌ని హ‌మీ ఇచ్చారు. వ‌యోవృద్దులు ఆరోగ్యంగా ఆనందంగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం, త‌మ సాధికార‌త శాఖ ఎల్ల‌ప్పుడు తోడుగా ఉంటుందని మంత్రి సీత‌క్క భరోసా క‌ల్పించారు. వికలాంగులు, వయవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సాధికారత శాఖ చేప‌ట్టిన అవ‌గాహ‌న ర్యాలీలో ఆ శాఖ డైరెక్ట‌ర్ శైల‌జా, విక‌లాంగుల కార్పోరేష‌న్ చైర్మ‌న్ ముత్తినేని వీరయ్య తో పాటు పెద్ద సంఖ్య‌లో సీనియ‌ర్ సిటిజ‌న్లు పాల్గొన్నారు.


Similar News