కఠిన చర్యలు తీసుకోండి.. పోలీసులకు మంత్రి పొన్నం ఆదేశం

ఉపాధి కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాల బాట పట్టి అక్కడ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

Update: 2024-09-27 16:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధి కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాల బాట పట్టి అక్కడ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆ దేశాల్లో పడే బాధలతో పాటు నకిలీ ఏజెన్సీల చేతుల్లో చిక్కి మోసపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందంటూ వివిధ జిల్లాల నుంచి వచ్చిన బాధిత కుటుంబాల సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విన్నవించారు. కేవలం గల్ఫ్ బాధితుల కోసమే ప్రత్యేకంగా ప్రవాసీ ప్రజావాణి పేరుతో ప్రజా భవన్‌లో నెలకొల్పిన కౌంటర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రారంభించి బాధితుల నుంచి గ్రీవెన్స్ ను స్వీకరించారు. తొలి రోజునే గల్ఫ్ బాధిత కుటుంబాల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు, విజ్ఞప్తులు అందాయి. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న షేక్ హుస్సేన్ కుటుంబం నుంచి మొదటి అభ్యర్థనను మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య అందుకున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వినతి పత్రాలతో భారీ సంఖ్యలో గల్ఫ్ బాధిత కుటుంబాల సభ్యులు హాజరయ్యారు.

గల్ఫ్ కార్మికులు ఆ దేశాల్లో పడుతున్న బాధలకు ఇక్కడున్న వారి కుటుంబ సభ్యులు మానసికంగా కుంగిపోతున్నరని, ముఖ్యమంత్రికి పలు ఎన్జీవోల నుంచి, బాధిత కుటుంబాల నుంచి వరుస విజ్ఞప్తులు రావడంతో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని, మొదటి రోజునే భారీ సంఖ్యలో బాధితులు రావడం సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా అప్పటి పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు అంశాలపై స్పష్టమైన విధాన నిర్ణయాన్ని తీసుకున్నారని మంత్రి పొన్నం గుర్తుచేశారు. అందులో మొదటిది, తెలంగాణ ప్రభుత్వ పక్షాన ప్రజాభవన్‌లో ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సంబంధించినదని నొక్కిచెప్పారు. రాష్ట్రం నుండి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం లక్షల సంఖ్యలో యువత వెళ్ళారని గుర్తుచేశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవడానికి ఈ ప్రాసెస్ ఉపయోగపడుతుందన్నారు.

గల్ఫ్ దేశాల్లో ప్రమాదవశాత్తూ చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు తలా రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రెషియా ఇవ్వడానికి ఇప్పటికే జీవో జారీ అయిందని మంత్రి పొన్నం గుర్తుచేశారు. గల్ఫ్ కార్మికుల కుటుంబాల పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా గురుకులాల్లో అడ్మిషన్లు కల్పిస్తున్నామని తెలిపారు. గల్ఫ్ కార్మికుల కోసం ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి ప్రాతినిద్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో ఒక అడ్వైజరీ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నదని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో జాబ్ మేళా పెడితే సుమారు తొమ్మిది వేల మంది వచ్చారని, విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం పోయేవారికి అక్కడి చట్టాలపై స్పష్టమైన అవగాహన ఉండడం లేదన్నారు. ఇక్కడి కంపెనీలపై అవగాహన కల్పించి విస్తృత సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రజలను మోసం చేస్తూ విదేశాలకు పంపించి అక్కడ ఇబ్బందులు పడేలా చేస్తున్న నకిలీ ఏజెన్సీలపైనా, వాటి నిర్వాహకులపైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ఆదేశించారు.

విదేశాలకు ఉపాధి కోసం వెళ్ళేవారిని గైడ్ చేయడానికి, తగిన సహకారం అందించడానికి ప్రభుత్వం తరఫున పనిచేసే సంస్థలు ఉన్నాయని, వాటిల్లో అవగాహన పొందడంతో పాటు శిక్షణ తీసుకుని ఎలాంటి మోసాలకు తావు లేకుండా విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొందవచ్చని మంత్రి పొన్నం ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు వివరించారు. ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ప్రవాసీ ప్రజావాణి తీసుకురావడానికి కృషి చేసిన అందరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పీసీసీ ఎన్నారై సెల్ ఛైర్మన్ వినోద్ కుమార్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య, ఎన్నారై విభాగం ప్రతినిధులు మందా భీం రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, నరేష్ రెడ్డి, నవీన్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.


Similar News