ప్రవళిక గ్రూప్-2కు దరఖాస్తు చేసుకోలేదు.. కీలక విషయం బయటపెట్టిన మంత్రి కేటీఆర్

తెలంగాణలో కలకలం రేపిన ప్రవళిక ఆత్మహత్యపై మంత్రి

Update: 2023-10-15 15:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కలకలం రేపిన ప్రవళిక ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రవళిక అసలు గ్రూప్-2 పరీక్షకు దరఖాస్తు చేసుకోలేదని, అది తెలుసుకోకుండా రాహుల్ గాంధీ, ఖర్గే ట్వీట్లు చేశారని అన్నారు. యవతి మరణంపై కాంగ్రెస్ నేతలు దిగజారుడు రాజకీయాలు చేశారని ఆరోపించారు. ఇలా దిగజారుడు రాజకీయాలు చేయడం కరెక్టా? అని ప్రశ్నించారు. గ్రూప్-2కు యువతి అప్లై చేసుకోలేదనే విషయాన్ని తెలుసుకోకుండా ప్రతిపక్షాలు హడావుడి చేశాయని అన్నారు.

ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు చెప్పారని కేటీఆర్ తెలిపారు. యువతి వాట్సప్ చాట్ బయటకు వస్తే కుటుంబ పరువు పోదా? అని అన్నారు. ప్రతిపక్షాలు మాట్లాడేముందు తెలుసుకుని మాట్లాడాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్‌లో ప్రవళిక అనే యువతి సూసైడ్ చేసుకోగా.. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయడం వల్ల మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. 

ప్రవళిక ఆత్మహత్యపై హైదరాబాద్‌లో నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా దిగారు. ప్రవళికది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం చేసిన హత్యేనంటూ రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు. పరీక్షలను వాయిదా వేసి నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుకుంటుందని ప్రతిపక్ష పార్టీలన్నీ విమర్శించాయి. కానీ పోలీసులు మాత్రం మరొలా చెబుతున్నారు. ప్రవళిక ఒక యువకుడిని ప్రేమించి మోసపోయిందని, అందుకే ఆత్మహత్యకు పాల్పడిందని వెల్లడించారు.


Similar News