KTR నీచ రాజ‌కీయాలు పరాకాష్ఠకు చేరాయి: మంత్రి జూప‌ల్లి

కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం చిన్నంబావి మండ‌లం ల‌క్ష్మిప‌ల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేత శ్రీధ‌ర్ రెడ్డి హత్యకు దురాల‌వాట్లు, భూత‌గ‌దాలు, ఆర్థిక లావాదేవీలే కారణమని ఎక్సైజ్, ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు.

Update: 2024-05-23 13:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం చిన్నంబావి మండ‌లం ల‌క్ష్మిప‌ల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేత శ్రీధ‌ర్ రెడ్డి హత్యకు దురాల‌వాట్లు, భూత‌గ‌దాలు, ఆర్థిక లావాదేవీలే కారణమని ఎక్సైజ్, ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. వ్యక్తిగత కార‌ణాల‌ వ‌ల్ల జ‌రిగిన హ‌త్యను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ నాయ‌కులు రాజ‌కీయ హత్యగా చిత్రీక‌రించ‌డం దుర్మార్గపు చ‌ర్య అని మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వ్యక్తిగత కార‌ణాలతో హ‌త్య జ‌రిగినా, రాజ‌కీయ రంగు పులిమి లేనిపోని రాద్దాంతం చేస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యకు దారితీసిన ప‌రిస్థితులు, పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంద‌ని కేటీఆరే చెబుతున్నార‌ని, అట్లాంట‌ప్పుడు రాజ‌కీయ హ‌త్య అని ద్వంద వైఖ‌రి ప్రదర్శించడం ఆయ‌న‌కే చెల్లింద‌ని కేటీఆర్‌పై మంత్రి మండిపడ్డారు.

హ‌త్య జ‌రిగిన క్షణాల్లోపే కేటీఆర్, బీఆర్ఎస్ నాయ‌కులు రంగంలోకి దిగి ప్రభుత్వంపై, వ్యక్తిగతంగా త‌న‌పై దుష్రాచారం చేయ‌డాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. ఏం జ‌రిగింది? ఎలా జ‌రిగింద‌ని తెలుసుకోకుండానే కావాల‌నే త‌నపై బుర‌ద‌జ‌ల్లే ప్రయత్నిస్తున్నారని మండిప‌డ్డారు. శ‌వ రాజ‌కీయాలు చేయ‌డం బీఆర్ఎస్‌కు కొత్త కాద‌ని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్కడ శవముంటే అక్కడ గద్దలా వాలి, నేరారోపణలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. తానేంటో ప్రజలకు తెలుసని, ఇన్నేళ్ల రాజ‌కీయ జీవితంలో ఎలాంటి మ‌చ్చ లేద‌ని, అందుకే కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గ ప్రజలు తనను ద‌శాబ్దాలుగా ఆద‌రిస్తున్నార‌న్నారు. గతంలో గంట్రావ్ పల్లి గ్రామంలో జ‌రిగిన మ‌ల్లేష్ హత్యకు కూడా రాజ‌కీయ రంగు పులిమార‌ని, ఇప్పుడు శ్రీధ‌ర్ రెడ్డి హ‌త్యను కూడా రాజ‌కీయం చేస్తున్నార‌ని దుయ్యబట్టారన్నారు. శ్రీధ‌ర్ రెడ్డి హ‌త్యపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారని, విచార‌ణ‌లో అన్ని విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయ‌న్నారు.

Tags:    

Similar News