సమయం, సందర్భం బట్టి CBI ఎంట్రీ.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై మంత్రి జూపల్లి హాట్ కామెంట్స్

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఓ ప్రైవేట్ టీవీ

Update: 2024-04-28 16:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ డిబేట్‌లో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయం కోసం ఇష్టారాజ్యంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. రాజకీయ స్వార్థం కోసం బీఆర్ఎస్ ఇంత దిగజారుడు తనానికి పాల్పడటం అవసరమా అని ప్రశ్నించారు. అసలు ప్రతిపక్ష నేతలు, సెలబ్రెటీల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణ జరుగుతోందని.. దర్యాప్తు ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. సమయం, సందర్భాన్ని బట్టి ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని పిలుస్తామని మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, స్టేట్ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సమయాన్ని బట్టి సీబీఐని పిలుస్తామని మంత్రి అనడం హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ సీబీఐ ఎంట్రీ ఇస్తే ఈ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇక, కేసీఆర్ పాలన ప్రజాస్వామ్యయుతంగా జరగలేదని.. కనీసం మంత్రులను కూడా మనుషులుగా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను కూడా ఒక బాధితుడినేనని అన్నారు. పార్టీలో చేరకముందు ఒకలా.. చేరాక మరోలా కేసీఆర్ ప్రవర్తించారని చెప్పారు. ఒక మంత్రిగా నా డిపార్ట్‌మెంట్ విషయంపై వెళితే కూడా కేసీఆర్ కలవలేదని అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులకు నేను బాధ్యుడిని కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడటం ‘నవ్విపోదురుగాక’ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయ్యిందని అన్నారు.


Similar News