వరంగల్ ప్రజలకు హరీశ్ రావు శుభవార్త.. దసరా నుంచి షురూ!

శస్త్ర చికిత్సలు చేసి పసిపిల్లలకు ప్రాణం పోసిన యూకే వైద్యులకు హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు సన్మానం చేశారు.

Update: 2023-03-04 10:51 GMT
వరంగల్ ప్రజలకు హరీశ్ రావు శుభవార్త.. దసరా నుంచి షురూ!
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: నిమ్స్ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్లు పూర్తి చేసుకున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి హరీష్​రావు డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. శనివారం స్వయంగా ఆసుపత్రికి వెళ్లిన ఆయన చిన్నారులను పలకరించి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పసి హృదయాలు కాపాడేందుకు, తమ ఆహ్వానం మేరకు నిమ్స్ ఆసుపత్రికి వచ్చిన బ్రిటన్ వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ వెంకట రమణ దన్నపనేని తమ బృందంతో వచ్చి నిలోఫర్, నిమ్స్ వైద్యులకు సహకారం అందించారన్నారు. అందరూ కలిసి 9 మంచి చిన్నారులకు సర్జరీలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు.

ఎక్మో మీద ఉన్న చిన్నారికి కూడా సర్జరీ చేయడం గొప్ప విషయమన్నారు. ఒక్కో సర్జరీని 20 మంది వైద్య బృందం 4 నుంచి 5 గంటల పాటు చేసి, 9 ప్రాణాలు కాపాడారన్నారు. నిమ్స్ ఇంచార్జి డైరెక్టర్ బీరప్ప, నిలోఫర్ సూపరింటెండెంట్ ఉషారాణిలకు అభినందనలు తెలిపారు. పుట్టిన రాష్ట్రంలోని ప్రజలకు సేవ చేయాలని వచ్చిన డాక్టర్ రమణ చొరవ అద్భుతమన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులు పుట్టిన గడ్డకు మేలు చేయాలని మంత్రి పిలుపు నిచ్చారు. విదేశీ నిపుణులను తీసుకొచ్చి ఇలాంటి క్లిష్టమైన సర్జరీలు చేసిన సందర్భం ఢిల్లీ ఎయిమ్స్ తర్వాత ప్రభుత్వ నిమ్స్‌లోనే జరగడం విశేషమని మంత్రి కొనియాడారు. లక్షల రూపాయలు ఖర్చు తో కూడిన సర్జరీలను ఉచితంగా నిర్వహించామని మంత్రి పేర్కొన్నారు.

నిరుపేదలకు కార్పొరేట్ తరహా సేవలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. వచ్చే దసరా పండుగ వరకు వరంగల్ పట్టణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తామని ప్రకటించారు. రూ.6 వేల కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి రానుందని తెలిపారు. అంతేగాక, మరో 2 వేల పడకలతో నిమ్స్‌ను విస్తరిస్తామని అన్నారు. విదేశాల్లో ఉన్న వైద్య నిపుణులు సొంతగడ్డపై సేవలు అందించాలని పిలుపునిచ్చారు. వైద్య రంగంలోకి సరికొత్త విజ్ఞానం, సాంకేతికత అందించాలని కోరారు. 

Tags:    

Similar News