Mettu Sai Kumar: 'పద్మ' అవార్డులు ఇచ్చేది కేంద్రమా? బీజేపీనా?: మెట్టు సాయి కుమార్
బండి సంజయ్ వ్యాఖ్యలపై మెట్టు సాయి కుమార్ రియాక్షన్

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ వాదాన్ని, అమరవీరుల కుటుంబాలను అగౌరవపరిచేలా, అవమానించేలా మాట్లాడారని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ (Mettu Sai Kumar) విమర్శించారు. గద్దర్ కు పద్మశ్రీ పురస్కారం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై మెట్టు సాయి కుమార్ తాజాగా స్పందించారు. గాంధీ భవన్ లో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన పద్మ అవార్డులు (Padma Awards) ఇచ్చేది కేంద్రమా? బీజేపీ పార్టీనా అని ప్రశ్నించారు. సేవా, కళ, సాహిత్య, వైద్య రంగాల్లో అందించే సేవలకు గాను పద్మ అవార్డులు ఇస్తారని ఈ అవార్డులు బీజేపీ అధ్యక్షుడు ఇవ్వరని అన్నారు. తెలంగాణ అమరవీరులను, ప్రజాసంఘాలను అవమానించిన బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో గద్దర్ (Gaddar) పాటలు తెలంగాణ సమాజంలో పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లేలా ఉత్తేజపరిచాయని గుర్తు చేశారు. ఎక్కడేం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్నారని, బండి సంజయ్ వ్యాఖ్యలను చూసి సిగ్గుపడుతున్నామన్నారు.