తెలంగాణ గవర్నర్‌పై మెడికో ప్రీతి సోదరి ఆగ్రహం (వీడియో)
నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతిని పరామర్శించేందుకు వెళ్లిన గవర్నర్ తీరుపై ప్రీతి సోదరి ఆగ్రహం వ్యక్తం చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతిని పరామర్శించేందుకు వెళ్లిన గవర్నర్ తీరుపై ప్రీతి సోదరి ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం గవర్నర్ తమిళిసై పూలదండతో వచ్చారని బాధితురాలి సోదరి ఆగ్రహం వ్యక్తం చేసింది. నా సోదరి చనిపోయిందునుకుని పూలదండ తీసుకువచ్చారా? అంటూ మండిపడింది. గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలాగేనా వ్యవహరించేది? అని నిలదీసింది. అయితే దీనికి సంభందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
రాజ్‌భవన్ క్లారిటీ:
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మెడికో ప్రీతిని పరామర్శించేందుకు గవర్నర్ పూలదండతో పచ్చారని జరుగుతున్న ప్రచారాన్ని రాజ్‌భవన్ తీవ్రంగా ఖండించింది. ఖైరతాబాద్‌లోని హనుమంతుడి గుడిలో సమర్పించడానికి కారులో పూలదండ ఉంచామని స్పష్టం చేసింది. గవర్నర్ వేరే ప్రదేశాల నుంచి రాజ్‌భవన్‌కు తిరిగి వచ్చేటప్పుడు ఖైరతాబాద్‌లోని హనుమంతుడి గుడికి వెళ్లి రావడం చాలా రోజుల నుంచి ఆనవాయితీగా ఉందని వివరించింది. ఈ విషయాన్ని దుష్ప్రచారం చేస్తూ విపరీతార్థాలు తీయడం సహేతుకం కాదని పేర్కొంది.
అలాగే హనుమంతుడి గుడిలో బాధితురాలు త్వరగా కోలుకోవాలని గవర్నర్ ప్రార్థించారని తెలిపింది. గవర్నర్ రాజ్‌భవన్‌కు వచ్చిన వెంటనే ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు సమగ్రంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా ఆదేశించారని తెలిపింది. గవర్నర్ నిమ్స్ పర్యటనను సరైన దృష్టితో అర్థం చేసుకోవాలని రాజ్‌భవన్ విజ్ఞప్తి చేసింది.