జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

జర్నలిస్టుల సంక్షేమం కోసం త్వరలో నూతన విధానం రూపొందిస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Update: 2024-06-18 11:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జర్నలిస్టుల సంక్షేమం కోసం త్వరలో నూతన విధానం రూపొందిస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఖమ్మంలో జరుగుతున్న టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర మహాసభలకు వెళుతున్న సందర్భంగా ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన ఇల్లు, ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పట్ల తమ సమస్యలు పరిష్కారం అవుతాయని జర్నలిస్టులలో ఒక రకమైన నమ్మకం, విశ్వాసం ఏర్పడ్డాయన్నారు. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి శాసనసభ వ్యవహారాలు, ఓటు ఆన్ అకౌంట్, తదుపరి లోక్ సభ ఎలక్షన్లు వరుసగా రావడంతో పరిపాలనపై దృష్టి కేంద్రీకరించే విషయం కొంత ఆలస్యమైందన్నారు. అయితే రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చర్చించడం జరిగిందన్నారు.

మీడియా అకాడమీ చైర్మన్ గా తాను, సమాచార శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డితో చర్చించి జర్నలిస్టుల సంక్షేమ కోసం విధి, విధానాలు రూపొందిస్తే వెంటనే సంతకం చేసి అమలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో జర్నలిస్టుల్లో ఈ ప్రభుత్వం పట్ల సానుకూల భావనలు ఏర్పడ్డాయని వెల్లడించారు. హెల్త్ కార్డుల విషయంలో ఏర్పడిన సమస్యలన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో 24 వేల అక్రిడిటేషన్లు కలిగి ఉన్నామని వివరించారు. అనర్హులకు అక్రిడిటేషన్లు అందకుండా ఒక క్రీమ్ లైన్ ఏర్పాటు చేస్తామని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు తప్పకుండా అక్రిడిటేషన్ వచ్చేలా చేస్తామని చెప్పారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో జరిగిన కుటుంబం ఆత్మహత్య విషయంలో జర్నలిస్టుల బ్లాక్ మెయిల్ కారణంగా జర్నలిస్టుల వృత్తికి మచ్చ ఏర్పడిందని, ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అనర్హులు అక్రిడిటేషన్ పొందడం వల్ల జర్నలిజం వృత్తి, వ్యక్తిత్వము మసక బారే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెలతో ముగుస్తున్న అక్రిడిటేషన్ల గడువును మరో మూడు నెలలు పెంచి ఈ లోపుగా కొత్త అక్రిడిటేషన్ల విషయంలో మిస్ యూజ్ కాకుండా కసరత్తు ప్రారంభిస్తామని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు కొణిజేటి సత్యనారాయణ, యూనియన్ హర్యానా, బీహార్ రాష్ట్రాల అధ్యక్షులు తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

Tags:    

Similar News