ఇంకా అందని ఓటర్ స్లిప్‌లు.. అంతర్జాలంలో సైతం చిరునామాలో గందరగోళం
మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్నది. ఓటు హక్కు
దిశ,పేట్ బషీరాబాద్: మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్నది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. అయితే ఓటు వేయడానికి ఆధారంగా ఉండే ఓటర్ స్లిప్ లు ఇంతవరకు ఓటర్లకు అందలేదు. 90 శాతం ఓటర్ చీటీలను పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది మాత్రం జరగలేదని తెలుస్తుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దగ్గర దగ్గర 7 లక్షల వరకు ఉన్న ఓటర్లకు సైతం ఓటర్ స్లిప్పులు అందకపోవడంతో తమ ఓటు ఎక్కడ ఉంది అనే విషయంపై గందరగోళంలో ఉన్నారు.
బీఎల్ వోల వద్దనే చీటీలు..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో ఆరు లక్షల 99 వేల 42 ఓట్లు ఉన్నట్టుగా అధికారులు దృవీకరించారు. వీరి కోసం 590 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసి ఒక్కొక్క పోలింగ్ బూత్ లో 11 వందల నుంచి 1200 ఓట్లు ఉండే విధంగా చేశారు. అదేవిధంగా ఒక్కొక్క పోలింగ్ బూత్ కు ఒక్కో బిఎల్ఓ ను నియమించారు. పోలింగ్ బూతుల వారిగా చీటీలను ఓటర్లకు ఇంటింటికి తిరిగి బి ఎల్ వోలు ఇవ్వాల్సి ఉండగా చాలా వరకు ఆ విధంగా జరగలేదు. “చాలావరకు అడ్రస్లు దొరకలేదు.. ఎక్కువ ఓట్లు ఉండటంతో ఇంటింటికి తిరిగి ఇవ్వలేకపోయాము.. 6 వందల వరకు మాత్రమే అందజేశాము..” అని అని ఒక బిఎల్ఓ చెప్పడం చూస్తుంటే పంపిణీ ఏ విధంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది బిఎల్వోలు చిరునామాలు దొరకలేదని చెబుతున్నప్పటికీ తుది జాబితా విడుదలకు ముందు ఇంటింటికి తిరిగి వెరిఫికేషన్ చేసామని చెప్పుకొచ్చిన అధికారులు ఓటర్ స్లిప్పులు అందజేసే సమయానికి చిరునామాల దొరకలేదని చెప్పడం గమనార్హం.
పోలింగ్ బూత్ చిరునామాలలో గందరగోళం
ఇక ఓటు ఏ పోలింగ్ బూత్ లో ఉన్నది అన్న విషయం తెలుసుకునేందుకు అంతర్జాలంలో ప్రయత్నించగా కొంతమందికి రెండు రెండు అడ్రస్సులు చూపించడంతో కొంచెం గందరగోళంగా. పోలింగ్ బూత్ నెంబర్ ఇచ్చి పలన స్కూల్ అని సూచించి తిరిగి ఇంకొక పాఠశాల పేరు ఉండటంపై కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ విషయంలో కూడా కొంతమంది బిఎల్ఓ లకు అవగాహన లేకుండా పోయింది. మా ఓటర్ స్లిప్పులు అందలేదు అని అడిగితే ఓటు వేయడానికి వచ్చినప్పుడు మేము అక్కడే ఉంటాము మా దగ్గరకు వచ్చి తీసుకోండి అని బీఎల్వోలు సమాధానం చెబుతున్నారు.
చీటీలను పంచిన పార్టీలు..
ఇక తమ తమ పార్టీ అభ్యర్థుల పేరు, ఎన్నికల చిహ్నాన్ని పేర్కొంటూ రాజకీయ పార్టీల ప్రతినిధుల సిబ్బంది ప్రత్యేకంగా ప్రింట్ చేసిన ఓటర్ స్లిప్పులను అందజేశారు. రాజకీయ పార్టీలు ఓటర్ స్లిప్పులను అందజేసే విషయంలో నిబంధనలు ఉన్నప్పటికీ ఎవరికి వారు పంచి పెట్టారు.
లిస్టులో అనర్హత ఓటర్లు..
ఇక ఓటర్ల తుది జాబితా అదేవిధంగా అనుబంధ జాబితా ప్రకారం నియోజకవర్గంలో దాదాపుగా 7 లక్షల వరకు ఓటర్లు ఉన్నారు. జాబితా విడుదలకు ముందు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేసి చనిపోయిన వారి ఓట్లు, ఇక్కడి నుంచి వెళ్లిపోయిన వారి ఓట్లు, రెండు రెండు ఉన్న ఓట్లు పంటి వారిని ఓటర్ల జాబితా నుంచి తీసివేసామని అధికారులు చెప్పుకొచ్చారు. అయితే ఓటరు జాబితాలో అధిక సంఖ్యలో డబుల్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు, తరలి వెళ్లిపోయిన వారి ఓట్లు సైతం లిస్టులో అలానే ఉన్నాయి.