Sanitation : పడకేసిన ప్రత్యేక పాలన.. సమస్యల వలయంలో పల్లెలు
పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన పడకేసింది.
దిశ,మేడ్చల్ బ్యూరో: పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన పడకేసింది. పాలక వర్గాల గడువు ముగియడంతో .. జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక అధికారుల బాధ్యతలను అప్పగించారు. పంచాయితీల్లో, ప్రత్యేక అధికారుల పాలనతో కొత్త చిక్కులు తప్పడం లేదు. అసలే ఉన్న సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న గ్రామాల్లో ..ఒక్కో జిల్లా అధికారికి రెండు, మూడు పంచాయితీల నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో... వారు చుట్టపు చూపుగానే పల్లెల్లో పర్యటనలు చేస్తున్నారు. దీంతో పల్లెల్లో సమస్యల చిట్టా అంతకంతకూ పేరుకుపోతుంది. ప్రజలు ఇక్కట్లు పడుతుంటే ..ప్రత్యేక పాలనలో నెట్టుకొస్తున్నారు.
చుట్టపు చూపుగా...
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 61 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయితీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి నెలాఖరున గ్రామాల్లో పాలక వర్గాల గడువు ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన కు శ్రీకారం చుట్టింది. పంచాయితీలకు జిల్లా, మండల స్థాయి అధికారులకు ప్రత్యేక అధికారుల బాధ్యతలను అప్పగించి పాలన సాగిస్తున్నారు. దీనికి తోడు జూలై 4వ తేదీన జిల్లా , మండల పరిషత్ పాలక వర్గాల పదవి కాలాలు సైతం ముగిశాయి. దీంతో జిల్లా పరిషత్ కు ప్రత్యేక అధికారిగా కలెక్టర్ గౌతమ్ ను నియమించగా, మండలాలకు కూడా జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు.ఇకపోతే కొందరు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న జిల్లా స్థాయి అధికారులకు సైతం రెండు,మూడు గ్రామాలకు ప్రత్యేక అధికార బాధ్యతలు అప్పగించడంతో అధిక భారం తో సతమతమవుతున్నారు. తమ శాఖలోనే తీరిక లేకుండా పనులు ఉండడంతో కొందరు జిల్లా స్థాయి అధికారులు రెండు, మూడు వారాలకు ఒకసారి కూడా గ్రామాలను సందర్శించడంలేదని తెలుస్తోంది.
పర్యవేక్షణ లేమితో..
ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గ్రామాల్లో ఎక్కడిక్కడ సమస్యలు పేరుకుపోతున్నాయి. ఎక్కువ గ్రామాల్లో చెత్త పేరుకుపోతుంది. పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మిషన్ భగీరథ పైపులైన్లు చాలా చోట్ల లీకై సక్రమంగా సరఫరా జరగడం లేదు. గ్రామాల్లో స్ట్రీట్ లైట్లు పాడై పోయినా పట్టించుకోవడం లేదని,కనీసం వాటిని బాగు చేయించే నాధుడే లేకుండా పోయారని శామీర్ పేట కు చెందిన సత్తయ్య వాపోతున్నారు.ఈ రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మురుగు కాల్వల్లో పేరుకుపోయిన మట్టి వల్ల డ్రైనేజీ నీరంతా రోడ్లపైకి వస్తోందని చీర్యాలకు చెందిన వెంకటేష్ పేర్కొంటున్నారు. ఇకపోతే గ్రామాల్లో చెత్త సేకరణకు గతంలో కొనుగోలు చేసిన ట్రాక్టర్లకు నెలవారీ ఈఎంఐలు భారంగా మారాయని గ్రామ కార్యదర్శలు వాపోతున్నారు. ట్రాక్టర్ల మరమ్మతులు వస్తే వారాల తరబడి సమయం పడుతుందని అలియాబాద్ గ్రామానికి చెందిన లక్ష్మయ్య చెబుతున్నారు. ఇకపోతే అక్రమ కట్టడాలు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి.అనుమతులు లేకుండా గ్రామాల్లో గృహ, వాణిజ్య నిర్మాణాలతోపాటు డూప్లెక్స్ లను నిర్మిస్తున్నారు. కొందరు ఫామ్ హౌస్ ల పేరిట బహుళ అంతస్తులను అనుమతులు లేకుండా కడుతున్నారు. అక్రమ షెడ్ల నిర్మాణం జోరుగా సాగుతున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు, విధుల భారంతో వారానికి కోకసారి కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో పంచాయితీల్లో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
నిధుల సమస్య..
కేంద్ర ప్రభుత్వ నిధులు రెండు నెలలకోసారి మంజూరవుతున్న సరిపోక పంచాయితీలకు ఇక్కట్లు తప్పడం లేదు. పాలక వర్గం ఉన్న సమయంలో అప్పో సప్పో తెచ్చి గ్రామాల అభివృద్దికి సర్పంచులు పూనుకునే వారని పలువురు గ్రామస్తులు పేర్కొంటున్నారు. బిల్లులు మంజూరైనప్పుడు తీసుకునేవారని, కానీ ఇప్పుడు పంచాయితీల్లో నిధుల లేమితో అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో ప్రస్తుతం మెజారిటీ మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలంతా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు పెత్తనం చలాయిస్తున్నారు.దీంతో ప్రత్యేక అధికారుల పాలనలో స్థానిక కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతల రాజకీయ జోక్యం మితిమీరిపోతున్న, గ్రామాలకు మంజూరైన పనుల్లో రాజకీయ పార్టీల నాయకుల జోక్యం పెరిగిపోయింది.ఆయా పనులకు సంబంధించి ఒత్తిళ్లు తప్పకపోవడం వల్ల ప్రత్యేక అధికారులు మిన్నకుండి పోతున్నారు. అయితే మేడ్చల్ జిల్లాకు స్థానిక సంస్థల నూతన అదనపు కలెక్టర్ గా రాధికా గుప్తాను ప్రభుత్వం శనివారం నియమించింది. ఆమె నేడో.. రేపో బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో గ్రామాల్లో పడకేసిన ప్రత్యేక పాలనను గాడిన పెడుతుందా..? లేదా..? వేచి చూడాలి మరీ..