10 ఏళ్ల క్రితం నిలిచిన రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం
పట్టణ కేంద్రంలో 10 సంవత్సరాల క్రితం నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులు శనివారం ఘట్కేసర్ మండల రెవెన్యూ అధికారి డీఎస్ రజిని ఆధ్వర్యంలో ప్రారంభించారు.
దిశ, ఘట్కేసర్ : పట్టణ కేంద్రంలో 10 సంవత్సరాల క్రితం నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులు శనివారం ఘట్కేసర్ మండల రెవెన్యూ అధికారి డీఎస్ రజిని ఆధ్వర్యంలో ప్రారంభించారు. బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించగా దాదాపు 25 మంది బాధితులు పరిహారాన్ని తీసుకున్నారు. కాగా ప్రభుత్వం ఇచ్చే పరిహారం సంతృప్తికరంగా లేకపోవడంతో కొంతమంది కోర్టుకు వెళ్లడంతో విస్తరణ పనులు నిలిచిపోయాయి. కాగా నష్టపరిహారం విషయంలో కోర్టులో వేసిన కేసులు అన్నీ కొట్టివేయడంతో జిల్లా అధికార యంత్రాంగం రోడ్డు విస్తరణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రెవెన్యూ అధికారుల సమక్షంలో నష్టపరిహారం తీసుకున్న వారి ఇండ్లను కూల్చివేశారు.
అయితే నష్టపరిహార విషయంలో కోర్టుకెక్కిన బాధితులు పట్టణ కేంద్రంలో వంతెన నిర్మాణం కోసం రిలే నిరాహార దీక్ష చేపట్టిన వారితో వాగ్వాదానికి దిగారు. అసలు రిలే నిరాహార దీక్ష ఎందుకు చేపట్టారు..మాకు న్యాయం జరగకుండా మీరే చేశారంటూ గొడవకు దిగారు. వంతెన నిర్మాణం విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని... మాకు రావాల్సిన పరిహారం సరిగా వస్తే మేమెందుకు కోర్టుకు వెళ్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే రిలే నిరాహార దీక్ష చేపడుతున్న జేఏసీ నాయకులు తాము చేపడుతున్న దీక్ష పట్టణ అభివృద్ధి కోసమేనని, ఎవరి స్వార్థం కోసం కాదని చెప్పారు. మీకు న్యాయం జరగాలంటే మీరు కూడా నిరాహార దీక్షలు చేపట్టమని సలహా ఇచ్చారు. కాగా ఒకవైపు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు, మరో పక్క నష్టపరిహారం కోసం బాధితుల ఆందోళన కలిసి ఈ వివాదం ఎటువైపు వెళ్తుందోనని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం విషయంలో జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు సరైన నిర్ణయం తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.