దేవాలయాల పరిరక్షణకు పటిష్ట చర్యలు

తెలంగాణ రాష్ట్రంలోని హిందూ దేవాలయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.

Update: 2024-12-11 12:07 GMT

దిశ, తిరుమలగిరి : తెలంగాణ రాష్ట్రంలోని హిందూ దేవాలయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రాణ:ప్రతిష్ఠ కార్యక్రమం బుధవారం కన్నుల పండువగా సాగింది. పుణ:ప్రతిష్ఠ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ,హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరై ప్రత్యేక పూజలు,హోమాలు నిర్వహించారు. మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

    అనంతరం వేదమంత్రాలతో, శాంతి హోమాలతో శాస్త్రోక్తంగా అమ్మవారి ప్రాణ:ప్రతిష్ఠ కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించారు. మంత్రి సురేఖ ఆలయం వద్ద పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని దేవాలయాన్ని ప్రభుత్వ ఖర్చులతో పునర్నిర్మించడంతో పాటు అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటూ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం సంతోషం కలిగించిందని అన్నారు. రాష్ట్రంలోని దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. కొంతమంది రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టడం మానుకోవాలని ఆమె వారికి హితవు పలికారు. 


Similar News