దిశ, మేడ్చల్ టౌన్: పుష్ప సినిమాలో చూసిన విధంగా ఎంతో చాకచక్యంగా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఓ డీసీఎం లో ఎర్ర చందనం దుంగలను పెట్టి అవి కనిపించకుండా వాటిపై కొబ్బరి బోండాలు పెట్టి తరలిస్తున్న వాహనాన్ని చూసి ఎస్ఓటీ పోలీసులు ఆశ్చర్యపోయారు. పుష్ప సినిమా లాగా ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేయడం చూసి ఒక్కసారి పుష్ప సినిమాను తలుచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ రోడ్డు వద్ద ఓ డీసీఎం వ్యాన్‌లో సుమారు 30 నుండి 50 లక్షల విలువ చేసే ఎర్ర చందనం ను బుధవారం సాయంత్రం సమయంలో ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏలూరు నుండి నాగాపూర్‌కు తరలిస్తున్న ఎర్ర చందనం గల డీసీఎం ను మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. ఎర్రచందనం గల డీసీ వ్యాన్ యూపీ కి చెందినదని గుర్తించామని తెలిపారు. ఎర్ర చందనం తరలిస్తున్న కర్నూల్‌కు చెందిన ప్రతాప్, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన హారి ప్రకాష్, ఢిల్లీకి చెందిన సత్య బాహులను అదుపులోకి తీసుకొని ఎర్ర చందనాన్ని, డీసీఎం వ్యాన్‌ను స్వాదీనం చేసుకున్నామని వివరించారు.