అక్రమ నిర్మాణానికి రేట్ ఫిక్స్​

మూసాపేట్ సర్కిల్​పరిధిలో ఎక్కడ అక్రమ నిర్మాణం కట్టినా, కట్టాలనుకున్న మినిమమ్ రూ.2లక్షలు రేట్​ఫిక్స్​చేశారు. మామూలు ఇవ్వాల్సిందే నిర్మాణం పెట్టుకోవాల్సిందే.

Update: 2024-12-19 02:33 GMT

దిశ, కూకట్‌పల్లి : మూసాపేట్ సర్కిల్​పరిధిలో ఎక్కడ అక్రమ నిర్మాణం కట్టినా, కట్టాలనుకున్న మినిమమ్ రూ.2లక్షలు రేట్​ఫిక్స్​చేశారు. మామూలు ఇవ్వాల్సిందే నిర్మాణం పెట్టుకోవాల్సిందే. ఒకవేళ ఇవ్వడంలో ఆలస్యమైనా ఇవ్వకున్నా ఎంతటి వారు అడ్డొచ్చినా సీజ్ చేయడం ఖాయం అన్న రీతిలో ఉంది పరిస్థితి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో మూసాపేట్​సర్కిల్​అంటేనే ప్రత్యేకం. ఇక్కడ టౌన్​ ప్లానింగ్ విభాగంలో పోస్టు​కోసం అధికారులు చేసే పైరవీలు అన్ని ఇన్ని కావు. గత పదేండ్లు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్న చందంగా తయారైంది మూసాపేట్​ సర్కిల్​ టౌన్​ ప్లానింగ్​ విభాగం తీరు. సర్కిల్‌కు ఇన్‌చార్జి​ ఏసీపీ నెలలో రెండు వారాలు విధులకు హాజరువుతుంటారు. మిగిలిన రోజులు ఫలక్‌నుమా సర్కిల్‌లో విధులు నిర్వహిస్తుంటారు. సర్కిల్​ పరిధిలోని ఐదు డివిజన్లకు ఒకే ఒక టీపీఎస్​ విధులు నిర్వహిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడే విధులు నిర్వహించిన టీపీఎస్​ బదిలీపై పక్క సర్కిల్‌కు వెళ్లి తిరిగి మూసాపేట్​ సర్కిల్‌కు వచ్చారు. వచ్చిన నాటి నుంచి టీపీఎస్​ ఎవరికి కనిపించలేదు అన్న చర్చ సర్కిల్​ మొత్తంలో హాట్​ టాపిక్​గా కొనసాగుతుంది.

యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

మూసాపేట్​ సర్కిల్​ పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీ, బాలాజీనగర్, అల్లాపూర్, మూసాపేట్, ఫతేనగర్​ డివిజన్లలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా టౌన్​ ప్లానింగ్​ విభాగం అధికారులు అటు వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. కేవలం మామూళ్లే టార్గెట్‌గా పని చేస్తూ మామూళ్లు ఇవ్వని నిర్మాణాలను నిబంధనలను బేఖాతర్​పేరుతో సీజ్​ చేసి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి తాము నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్నారు. సర్కిల్​ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన వారికి సైతం టౌన్​ప్లానింగ్​ విభాగం అధికారులు అందుబాటులో లేక పోతుండటంతో ఫిర్యాదు దారులు నేరుగా ప్రజావాణిలో జోనల్​ కమిషనర్​కు ఫిర్యాదు చేస్తున్నారు. అంతే కాకుండా అధికారులపై సైతం ఫిర్యాదుల చేస్తున్నట్లు సమాచారం.

వన్​ మెన్​ షో

టౌన్​ప్లానింగ్ విభాగంలో ఏసీపీ, టీపీఎస్, చైన్​మెన్, న్యాక్​ఇంజనీర్​, డిమాలిషన్​ టీం సిబ్బంది ఉంటారు. గత కొన్ని రోజులుగా మూసాపేట్​సర్కిల్​పరిధిలో కేవలం ఏసీపీ, టీపిఎస్‌లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. పర్మినెంట్​ ఉద్యోగులుగా ఉన్న చైన్​ మెనల్లను కేవలం కార్యాలయానికి పరిమితం చేశారు. అక్రమ నిర్మాణాల వద్ద మామూళ్లు తీసుకుంటున్నారు, టౌన్​ ప్లానింగ్​ విభాగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని వారిపై ఆరోపణలు పెడుతూ నెలకు 40 వేల నుంచి 80 వేల వరకు ప్రభుత్వ ఖజాన నుంచి జీతాలు తీసుకుంటున్న పర్మినెంట్​ ఉద్యోగులు కేవలం అటెండెన్స్​ రిజిస్టర్‌లో సంతకం పెట్టి కార్యాలయం క్యాంటీన్​ వద్ద కాలక్షేపం చేస్తున్నారు. చైన్‌మెన్లు లేరు, ఉన్న ఏసీపీ నెలకు రెండు వారాలే విధులకు హాజరు అవుతుండటంతో మూసాపేట్​ సర్కిల్​ పరిధిలో కేవలం టీపీఎస్​ ఆడింది ఆట పాడింది పాటగా మారింది.


Similar News