MP Eatala : ప్రభుత్వానికి పోయేకాలం వచ్చింది

పేదలతో పెట్టుకున్న వారు.. వారి కళ్ళల్లో నీరు చూసే వారికి ఎప్పుడు

Update: 2024-09-27 09:07 GMT

దిశ,మేడ్చల్ బ్యూరో: పేదలతో పెట్టుకున్న వారు.. వారి కళ్ళల్లో నీరు చూసే వారికి ఎప్పుడు మంచి జరగదని, పోయేకాలం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలతో పెట్టుకుంటున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓల్డ్ ఆల్వాల్, జొన్న బండ, వడ్డెర బస్తి, మూసీ పరివాహక ప్రాంత వాసులకు హైడ్రా అధికారులు నోటీసులు ఇవ్వడంతో వారు తమ గోడును చెప్పుకుంటానికి శుక్రవారం శామీర్పేట లో ఉన్న ఎంపీ నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ శని ఆదివారాలు చూసుకొని హైడ్రా దొంగల్లా వచ్చి ఇండ్లను కూలగొడుతున్నారని, హైదరాబాద్ లో పేదలు కంటిమీద కునుకు లేకుండా బ్రతుకుతున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీలో మారుతి కంపెనీ కోసం సంజయ్ గాంధీ పేదల ఇళ్లను కూలగొట్టిన విషయంలో ఏమైందో అందరికీ తెలుసు అని, ఇక్కడ కూడా అదే తీరుగా వ్యవహరిస్తే తగిన ఫలితం పొందుతారని హెచ్చరించారు.

జీతాలకు డబ్బులు లేవు కానీ..

ప్రస్తుత ప్రభుత్వంలో ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ లక్షల కోట్ల రూపాయల వ్యయంతో మూసీ సుందరీకరణ చేపడతామని రేవంత్ ప్రభుత్వం చెప్పడం చూస్తుంటే బట్టలు లేవు కానీ బంగారం కొనిపిస్తా అన్నట్లు ఉందని పేర్కొన్నారు. అంతగా మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందుగా అక్కడ నివాసం ఏర్పరుచుకున్న వారికి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతనే ఆ ఇండ్ల జోలికి వెళ్లాలని, మూసీ దిక్కుగా బతుకుతున్న వారిని ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. మూసీ నది పరివాహక ప్రాంతానికి 60 ఫీట్ల ఎత్తులో ప్రైవేట్ భూమిలో ఉన్న చైతన్య పూరి ప్రాంతం వాళ్లకు కూడా నోటీసులు ఇవ్వడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జొన్న బండ ప్రాంతంలో 50 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్న వారికి కూడా నోటీసులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. హైడ్రా తీరుపై బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఇంద్ర పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని, పేదల పక్షాన పోరాడటానికి తాను అన్ని వేళ ముందుంటానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టింది కేవలం ఐదు సంవత్సరాల కాలం వరకేనని 50 సంవత్సరాల కాలం వరకు కాదని దీన్ని గుర్తుంచుకొని ప్రభుత్వం వ్యవహరించాలని లేనిపక్షంలో పేదల కన్నీళ్లలో కొట్టుకుపోతారని హెచ్చరించారు.


Similar News