రెండవ రోజూ కొనసాగిన కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ మంగళవారం రెండవ రోజూ కొనసాగింది.
దిశ , మేడ్చల్ బ్యూరో : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ మంగళవారం రెండవ రోజూ కొనసాగింది. అంతర్జాతీయ స్థాయిలో మూడు రోజుల పాటు నిర్వహించనుండగా బుధవారం వేడుకలు ముగియనున్నాయి. కాగా ఈ ఫెస్టివల్ లో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు విదేశీయులు, నగరవాసులు కూడా పాల్గొని సందడి చేశారు. చిన్నారులు సైతం కైట్ ఫెస్టివల్ లో పాల్గొని పతంగులను ఎగురవేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.పెరేడ్ గ్రౌండ్ లోకి సాధారణ సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించడంతో పెద్ద సంఖ్యలో హాజరై రంగు రంగుల, విచిత్ర ఆకృతులలో ఉన్న పతంగులను వీక్షించి మధురానుభూతులను పొందారు.
స్వీట్ ఫెస్టివల్‌లో భాగంగా తెలంగాణ సంప్రదాయ వంటలు, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు ఇంట్లోనే తయారు చేసిన రకరకాల స్వీట్లను అక్కడ ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టుల్లో ప్రదర్శించి విక్రయించారు. ఈ వేడుకలకు సుమారు 15 లక్షల మందికి పైగా సందర్శకులు వస్తారని టూరిజం శాఖ అధికారులు అంచనా వేసి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. సందర్శకులతో పాటు ఫెస్టివల్ లో పాల్గొనే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఏర్పాట్లు పూర్తి చేసి సమీక్షించారు. అంతేకాకుండా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేపి సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు 99481 39909 నంబరును అందుబాటులో ఉంచారు.