Etela Rajender : జవహర్ నగర్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా : ఈటల
పిచ్చి కుక్కలకు స్వైర విహారానికి, అసాంఘిక
దిశ,జవహర్ నగర్ : పిచ్చి కుక్కలకు స్వైర విహారానికి, అసాంఘిక కార్యకలాపాలు,గంజాయికి జవహర్ నగర్ అడ్డగా మారిందని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ ఉద్యోగులు, పోలీసులు ఎవరి దగ్గరికి వెళ్లి బాధలు చెప్పుకున్న కనీసం సమాధానం ఇవ్వకపోవడం దారుణమన్నారు. లక్ష పైబడి జనాభా ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న పేదల పట్ల వారి జీవితాల పట్ల అధికారులు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారుని మండి పడ్డారు. కుక్కల దాడిలో చనిపోయిన విహన్ కుటుంబాన్ని ఈటల రాజేందర్ గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ లో పలు ప్రాంతాలను పరిశీలించి, స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. స్థానిక ప్రజానీకమంతా వీధి దీపాలు పెట్టండి, రోడ్లు వేయండి, సెక్యూరిటీ కోసం కాంపౌండ్ వాల్ కట్టండి, సీసీ కెమెరాలు పెట్టండి... జవహర్ నగర్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతూ ఉంది, పోలీస్ సెక్యూరిటీ పెంచమని ఎన్ని సార్లు దరఖాస్తు ఇచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు పెడచెవిన పెట్టారు తప్ప స్పందించిన పాపాన పోలేదన్నారు.బుధవారం కుక్కల దాడిలో చనిపోయిన విహాన్ కుటుంబం మిర్దొడ్డి ప్రాంతం నుంచి పొట్ట చేత పట్టుకుని ఇక్కడ జీవనానికి వచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు.. బయటకి వెళ్ళిన రెండు సంవత్సరాల అబ్బాయిని పది పదిహేను కుక్కలు పీక్కుతిన్న తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు.
ఇంత జరిగినా కూడా ముఖ్యమంత్రి ఎవరినో మందలించి నట్లుగా పేపర్లో రాయించుకున్నాడు తప్ప... ఆయన కూడా ఇక్కడ ఐదు సంవత్సరాలపాటు ఎంపీగా ఉన్నారు, బాలాజీ నగర్ ఏంటో వారి బతుకులు ఏంటో కూడా తెలుసు. కానీ ఆయన మాత్రం ఆ కుటుంబాన్ని ఆదుకుంటానానే ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఒక్క జవహర్ నగర్ లోనే కాదు అనేక బస్తీలలో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయని స్పష్టంచేశారు.ఆ కుటుంబానికి 50 వేల రూపాయలు ఇస్తామని చెప్పి ముసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఈటల మండిపడ్డారు.ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఏమాత్రం మమకారం ఉన్న వారి సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.. విహాన్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ పరమైన ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరారు. జవహర్ నగర్ లో రోడ్లు, సీసీ కెమెరాలు, లైట్లు ఏర్పాటు చేయాలని ఈటల డిమాండ్ చేశారు.దీని మీద ప్రభుత్వం స్పందించక పోతే భారతీయ జనతా పార్టీ తరపున ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని రాజేందర్ హెచ్చరించారు.