దిశ ఎఫెక్ట్.. ప్రైమార్క్ కట్టుకాలువ కబ్జా పై కదిలిన ఇరిగేషన్ యంత్రాంగం...
ప్రైమార్క్ అపార్టుమెంట్స్ కట్టుకాలువ కబ్జా పై "దిశ"లో ప్రచురితమైన వరుస కథనాలకు ఎట్టికేలకు ఇరిగేషన్ యంత్రాంగం కదిలింది.
దిశ, దుండిగల్ : ప్రైమార్క్ అపార్టుమెంట్స్ కట్టుకాలువ కబ్జా పై "దిశ"లో ప్రచురితమైన వరుస కథనాలకు ఎట్టికేలకు ఇరిగేషన్ యంత్రాంగం కదిలింది. ఈ నెల 7 న "కట్టుకాలువ కనుమరుగు" అంటూ ఒక కథనం, 8వ తేదీన "బడా బిల్డర్ బరితెగింపు" అనే కథనాలు ప్రచురితం కావడంతో ఇరిగేషన్ డీఈ సురేష్ ఆధ్వర్యంలో ఏఈ సారా, సునీల్ శుక్రవారం బాబ్బాకాన్ చెరువు కట్టుకాలువ కబ్జాను పరిశీలించారు. బాబ్బాకాన్ చెరువు అలుగు, తూముతో పాటు చెరువు నుండి పంట పొలాలకు పారే కట్టుకాలువను పరిశీలించిన రెవెన్యూ అధికారులు, ప్రైమార్క్ అపార్టుమెంట్స్ ముందు కబ్జాలతో మూసుకుపోయిన కల్వర్టును పరిశీలించి, ప్రైమార్క్ అపార్టుమెంట్స్ నిర్మాణదారుడు కట్టుకాలువను చేరబట్టి నిర్మించిన కట్టుకాలువ పరిసరాలను పరిశీలించారు. గ్రామ రైతులకు, ఫిర్యాదుదారులకు సమాచారం ఇవ్వకుండా తనిఖీలు నిర్వహించడం పై పలుఅనుమానాలకు తావిస్తుంది. ఇరిగేషన్ అధికారుల తీరు ప్రైమార్క్ నిర్మాణదారునికి సహకరించేలా ఉందంటూ గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జాయింట్ సర్వే అనంతర చర్యలు తప్పవు..
ప్రైమార్క్ కట్టుకాలువ కబ్జా పై శుక్రవారం డీఈ సురేష్ ఆధ్వర్యంలో అలుగు, కట్టుకాలువను పరిశీలించినట్లు ఇరిగేషన్ ఏ.ఈ సారా తెలిపారు. ప్రభుత్వ సర్వే నంబర్ల పై రెవెన్యూ అధికారుల పరిశీలనకు పంపుతున్నామని నివేదిక రాగానే జాయింట్ సర్వే నిర్వహించి ఎఫ్టీఎల్, కట్టుకాలువ కోఆర్డినెట్స్ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. కట్టుకాలువ కబ్జా అని తేలితే ఉపేక్షించమన్నారు.
ఫిర్యాదు దారులకు సమాచారం ఇవ్వకుండా తనిఖీలు...
బాబ్బాకాన్ చెరువు కట్టుకాలువను కబ్జా చేసి ప్రైమార్క్ నిర్మాణదారుడు అపార్టుమెంట్స్ నిర్మించడం వలన దిగువన ఉన్న పొలాలకు నీరు అందడం లేదని, కట్టుకాలువ కబ్జాకు గురుకావడం వలన లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయంటూ గ్రామస్తులు రాయాన్నగారి అశోక్ రాజు, సగ్గిడి నర్సింగ రావుల తోపాటు పలువురు రైతులు ఇరిగేషన్ అధికారులకు గతంలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు దారులకు కనీస సమచారం ఇవ్వకుండా బాబ్బాకాన్ చెరువు కట్టుకాలువ క్షబ్జాలపై శుక్రవారం ఇరిగేషన్ డీఈ సురేష్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ అధికారులు చడీచప్పుడు కాకుండా తనిఖీలు నిర్మావధించడం పై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారుల తీరు అక్రమనిర్మాణదారుని సహకరించేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.