హైడ్రా పేరుతో పేదల ఇళ్లకు నోటీసులు ఇస్తే సహించేది లేదు
పేదల ఇండ్లను కూల్చితే ఊరుకునేది లేదని మల్కాజిగిరి ప్లార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు.
దిశ, అల్వాల్ : పేదల ఇండ్లను కూల్చితే ఊరుకునేది లేదని మల్కాజిగిరి ప్లార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. శనివారం అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఆనందరావు నగర్, జానకినగర్, వాసవినగర్, భారతినగర్, రాంనగర్, ఎంఈఎస్ కాలనీ తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పర్యటించారు. ఆనందరావు నగర్ వెల్పేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా పక్కా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్న పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లకు ఎలా నోటీసులు ఇస్తారని అధికారులను ప్రశ్నించారు. హైడ్రా బూచిచూపి పేదలను భయబ్రాంతులకు గురిచేస్తే వారితో కలిసి ఉద్యమించడానికి తాను సిద్దంగా ఉన్నానని తెలిపారు.
అనంతరం కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చిన్నరాయుని చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ అంటూ పైన పేర్కొన్న కాలనీలలో 170 నోటీసులు ఎలా ఇస్తారని అధికారులను ప్రశ్నించారు. గతంలో చిన్నరాయుని చెరువు (17.25 గుంటలు) పదిహేడు ఎకరాల ఇరవై ఐదు గుంటలు ఉన్న చెరువు సడెన్ గా 40 ఎకరాలకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. నాటి లెక్కలకు నేటి లెక్కలకు చాలా తేడా ఉందని, దీనిని ఎవ్వరు నిర్ధారణ చేశారని అన్నారు. దానికి శాస్త్రీయ పద్దతి ఉందా అన్నారు. 17. 25 గుంటలు ఉన్న చెరువును 40 ఎకరాలు చేసి అందులో ఉన్న ఇండ్లకు 170 మందికి నోటీసులు ఇవ్వడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు.
30 సంవత్సరాల క్రితం అన్ని అనుమతులు వసతులతో ఏర్పాటు చేసుకున్న కాలనీలోని నివాసాలకు ఎలా నోటీసులు ఇస్తారని తెలిపారు.పేదల ఇండ్లను కూల్చడానికి వస్తే ఎట్టి పరిస్థితిలో అడ్డుకుని తీరుతామని శాంతి అధికారులను హెచ్చరించారు. అధికారులతో చర్చించి బాధితులకు తగు న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆనందరావు నగర్ కాలనీ అధ్యక్షుడు హరిబాబు, శ్రీనివాసరావు, లారెన్స్, శర్మ, నరహరి, రాజయ్య, కేఎస్ఎన్ మూర్తి, మోహన్ రావు, శ్రీనివాస్, స్థానిక నాయకులు మాణిక్యరెడ్డి, మాధవ్, మల్లికార్జున్ గౌడ్, కార్తీక్ గౌడ్, రవి కిరణ్, ఆంతోణి, లక్ష్మణ్, ప్రశాంత్ రెడ్డి, గోపి, మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.