Former Minister Harish Rao : తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి హరీష్ రావు..
పెండింగ్ బకాయిల విషయం పై సర్పంచ్ లు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావును అరెస్టు చేసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
దిశ, మేడ్చల్ బ్యూరో: పెండింగ్ బకాయిల విషయం పై సర్పంచ్ లు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావును అరెస్టు చేసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం మాజీ సర్పంచ్లను అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్ కు తరలించారని తెలుసుకున్న హరీష్ రావు వారికి అండగా నిలిచేందుకు వెళ్లారు. దీంతో అరెస్టు చేసిన సర్పంచ్ లను సైతం వేరే వేరే పోలీస్ స్టేషన్ లకు తరలించారు పోలీసులు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో హరీష్ రావు ఉన్నారని తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుమలగిరి ప్రధాన రహదారిలో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదన చారి, ఎంఎల్ఏ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ పద్మా దేవేందర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నగేష్, కంటోన్మెంట్ ఇన్చార్జి నివేదిత, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్స్..
రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులు ఛలో హైదరాబాద్ కు పిలుపునిస్తే, వారిని ఎక్కడిక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. అర్ధరాత్రి పూట దొంగలను, టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు మాజీ సర్పంచులను అరెస్టులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఇలా ఇప్పటికే పలు మార్లు చేశారన్నారు. సర్పంచుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేసి, భార్య పిల్లల మీద బంగారం అమ్మి పనులు చేసామని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు అడిగితే ఈ ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తున్నదని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచులు ఎంతో కృషి చేశారన్నారు. ఉత్తమమైన గ్రామాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందంటే, ప్రధాని అవార్డులు, పంచాయతీ అవార్డులు సాధించిందంటే అందులో సర్పంచుల పాత్ర కీలకం అన్నారు. మంచి పనులు చేసిన సర్పంచులకు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిక్ష వేస్తున్నారన్నారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు.
వందల కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారు. కానీ పేద సర్పంచులు పనులు చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్నా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చి 10 నెలలు దాటింది పది లక్షల బిల్లులు కూడా వారికి చెల్లించలేదన్నారు. నాలుగైదు సార్లు హైదరాబాద్ కు వచ్చి మోర పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి లేదా పంచాయతీ శాఖ మంత్రి సర్పంచులను చర్చలకు పిలవండి, వెంటనే వారి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. లక్షా 50వేల కోట్లతో మూసి బాగు చేస్తా అంటున్నావు. కానీ గ్రామాలను ఎంతో అభివృద్ధి చేసిన సర్పంచులకు ఎందుకు శిక్ష వేస్తున్నావు అని ప్రశ్నించారు. సర్పంచుల అరెస్టులు పరిష్కారం కాదు, సర్పంచుల ఫోన్లు గుంజుకొని టెర్రరిస్టుల లెక్క పోలీసు స్టేషన్లకు తీసుకుపోతున్నారన్నారు. మేము వచ్చి వారి బాధలు వినాలని వస్తే వారిని వెంటనే డీసీఎంలలో ఎక్కించి తరలిస్తున్నారు. పాపం భార్య పిల్లల మీద బంగారం అమ్మి పనులు చేశారని తెలిపారు. నిన్న గాక మొన్న బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చారు, వీరికి ఎందుకు ఇవ్వడం లేదని గళమెత్తారు. ఉన్న భూమి జాగ అమ్ముకుంటున్నారు. సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.