మెట్రోరైలు 3వ దశ విస్తరణకు తొలి అడుగు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెట్రో కారిడార్ మూడో దశ పనుల విషయమై సంబంధిత అధికారులు ఆయా ప్రాంతాల్లో శుక్రవారం భూసార పరీక్షలు నిర్వహించారు.

దిశ, తిరుమలగిరి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెట్రో కారిడార్ మూడో దశ పనుల విషయమై సంబంధిత అధికారులు ఆయా ప్రాంతాల్లో శుక్రవారం భూసార పరీక్షలు నిర్వహించారు. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుండి శామీర్ పేట్ వరకు, అదే విధంగా ప్యారడైజ్ చౌరస్తా నుండి మేడ్చల్ కండ్లకోయ వరకు మెట్రోరైలు 3వ దశ విస్తరణ చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి. ఈ మేరకు సంబంధిత అధికారులు మెట్రో రైలు కారిడార్ నిర్మించబోయే ప్రాంతాలలో భూసేకరణ పనులు కూడా ప్రారంభించారు. కాగా 3వ దశ మెట్రో విస్తరణకు ప్రతిపాదించిన మెట్రో కారిడార్ విషయమై వెంటనే ప్రణాళికలను సిద్ధం చేసి కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కి ముసాయిదా లేఖలు పంపాలని అధికారులను సీఎం ఆదేశించారు.
హైదరాబాద్ మహానగరానికి నలు దిక్కులా మెట్రోరైలు విస్తరణకై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్ధం అవుతుంది. ఈ మేరకు నగరం నలుమూలల 5 కారిడార్లలో మెట్రో విస్తరణకు సమగ్ర నివేదికలు, ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు. ఈ రైలు కారిడార్ నిర్మాణం పనులు పూర్తి అయినట్లయితే ఎన్నో సంవత్సరాలుగా ట్రాఫిక్, పొల్యూషన్ సమస్యలు ఎదుర్కొంటున్న వాహనదారులకు, ప్రజలకు కష్టాలు తీరనున్నాయి. నగరంలో వాహనదారులు, ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు వేగవంతంగా కొనసాగుతుండటంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది.