క్రిమినల్ చర్యల లిస్టులో కమిషనర్, తహసీల్దార్ ?
గ్రేటర్ హైదరాబాద్, హెచ్ఎండీఏ పరిధిలో గల చెరువులు, కుంటలను పూర్వ స్థితిలో ఉంచేందుకు హైడ్రా యాక్షన్ లోకి దిగింది.
దిశ, కుత్బుల్లాపూర్ : గ్రేటర్ హైదరాబాద్, హెచ్ఎండీఏ పరిధిలో గల చెరువులు, కుంటలను పూర్వ స్థితిలో ఉంచేందుకు హైడ్రా యాక్షన్ లోకి దిగింది. ఈ కోవలోనే నగరం చుట్టూరా ఉన్న పలు శివారు ప్రాంతాలలో కబ్జాలకు గురైన, గతంలో ఫిర్యాదు అందిన గుట్టు చప్పుడు కాకుండా చెరువు, కుంట స్థలాలు కబ్జా చేసి నిర్మాణాలు పూర్తి చేసిన వాటిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టి సారించారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి మండలంలో పలు చెరువులను, కుంటలను చెరబట్టి కబ్జా దారులు నిర్మాణాలు చేశారు. ఎర్రకుంట చెరువు కబ్జా కథ కూడా ఇందులో భాగంగా జరిగిందే. చెరువులు, కుంటలలో ఎన్ఓసీ లు, అనుమతులు, రెవెన్యూ స్కెచ్ మ్యాప్ లు మార్చి ఇచ్చేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పైరవీలకు తలొగ్గి కాసులకు కక్కుర్తి పడి ప్రభుత్వ వ్యతిరేక చర్యలు చేసినట్లు సమాచారం.
ఇలా బాచుపల్లి మండలంలో పలు చెరువు స్థలాలు కనుమరుగు అయ్యేందుకు నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్, బాచుపల్లి తహసీల్దార్ లు పరోక్షంగా సహకారం అందించినట్లుగా హైడ్రా అధికారులు గుర్తించినట్లు తెలిసింది. దీంతో నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు, బాచుపల్లి తహసీల్దార్ పూల్ సింగ్ లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు సమాచారం. అంతే కాకుండా ఇరువురు అధికారులపై బాచుపల్లి పీఎస్ లో కేసులు నమోదు చేయాలని హైడ్రా అధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వీరితో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిన వారిలో చందానగర్ డిప్యూటీ కమిషనర్, హెచ్ఎండీఏ ఏపీఓ,మేడ్చల్ జిల్లా సర్వే ఆఫ్ ఏడీ ఉన్నట్లు సమాచారం.