రూ.500 కోట్లతో చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం చేశాం

కేంద్ర ప్రభుత్వం నిధులు 500 కోట్ల రూపాయలతో చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం చేశామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

Update: 2024-12-21 12:52 GMT

దిశ,ఉప్పల్ : కేంద్ర ప్రభుత్వం నిధులు 500 కోట్ల రూపాయలతో చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం చేశామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల తాకిడి ఎక్కువ కావడంతో రాకపోకలకు ఇబ్బంది అవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో నరేంద్ర మోడీ చర్లపల్లిలో రైల్వే స్టేషన్ నిర్మాణం చేశారని చెప్పారు. తమ నాయకులు రైల్వే అధికారులతో సమీక్షించి పనులను పర్యవేక్షిస్తున్నారన్నారు. డిసెంబర్ 28న కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా చర్లపల్లి రైల్వే స్టేషన్ ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయబోతున్నామని తెలిపారు.

     ఈ సందర్భంగా ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులకు ఆయన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అంబేద్కర్ ని అవమానపరిచింది, ఓడగొట్టడానికి ప్రయత్నించింది, వారిని బయటకు పంపించింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఆయన అణగారిన వర్గాలకు, జాతులకు రిజర్వేషన్ కల్పిస్తే వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ కాదా అన్నారు. దాంతో దొంగే దొంగ అని అరిచినట్టుందని ఆరోపించారు. కావాలనే పార్లమెంటు ముందు రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలపై దాడి చేయడం సిగ్గు చేటన్నారు. 


Similar News