కంటోన్మెంట్ ప్రజల మౌలిక సదుపాయాల బాధ్యత అధికారులదే : ఎంపీ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో మంగళవారం సాధారణ బోర్డు సమావేశం బ్రిగేడియర్ నంజూదేశ్వర్ అధ్యక్షతన జరిగింది.

Update: 2025-04-08 15:42 GMT
కంటోన్మెంట్ ప్రజల మౌలిక సదుపాయాల బాధ్యత అధికారులదే : ఎంపీ
  • whatsapp icon

దిశ, తిరుమలగిరి : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో మంగళవారం సాధారణ బోర్డు సమావేశం బ్రిగేడియర్ నంజూదేశ్వర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్, బోర్డు నామినేటేడ్ సభ్యురాలు భానుక నర్మద, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ లు హాజరయ్యారు. బోర్డు పరిధిలోని పలు అంశాల పై బోర్డు అధికారులతో వారు సుదీర్ఘంగా చర్చించారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని మొత్తం 8 వార్డులలో ప్రజల కనీస సౌకర్యాలైన రోడ్లు, మంచినీటి వసతి, సివరేజ్, ఎలక్ట్రిసిటీ లాంటి మౌలిక వసతుల కల్పన బాధ్యత బోర్డుదేనని సూచించారు. ప్రత్యేకంగా బైలాస్ జోనల్ విధానాన్ని సీఎస్ఐటీ, జెఎన్యు, హెచ్డీఎంఎ, కంటోన్మెంట్ ఇంజనీర్ విభాగం అధికారులతో కలిసి కమిటీ ఏర్పాటు చేసి రక్షణ శాఖకు సిఫార్సు చేస్తామని తీర్మాణం చేశారు.

ముఖ్యంగా కంటోన్మెంట్ లో నిర్మాణాలకు సంబంధించి బిల్డింగ్ బైలాస్, వేసవి కాలం నేపథ్యంలో నీటి సరఫరా, బోర్డు పరిధిలోని వాటర్ బోర్ లకు కరెంట్ కనెక్షన్, సర్వీస్ ఛార్జెస్ కంటోన్మెంట్ పరిధిలో చేపడుతున్న పలు అక్రమకట్టడాల విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అంశం పై చర్చించారు. బోర్డులో నిర్ణయాలు ఏకపక్షంగా కాకుండా ప్రజల తరపున తమ గొంతు వినిపించడానికి ప్రజా ప్రతినిధులైన ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు కల్పించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. బోర్డులోని పలు సమస్యలు తీరాలంటే బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలి, లేదంటే తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని అప్పుడే ప్రజలు తమ సమస్యలు చెప్పకోవడానికి అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే సూచించారు. సర్వీస్ ఛార్జీలు ఎంత బకాయి ఉన్నయో ఖచ్చితంగా తేల్చి, బోర్డు రిసోల్యూషన్ పాస్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, కంటోన్మెంట్ వాటర్ వర్క్స్ అధికారి రాజ్ కుమార్, హెల్త్ సూపరిండెంట్ దేవేందర్, కంటోన్మెంట్ చీఫ్ ప్లానర్ ఉమాశంకర్, ఫణి కుమార్ లు పాల్గొన్నారు.

కంటోన్మెంట్ లో భవన నిర్మాణాలు సులభతరం.. ఎంపీ ఈటల రాజేందర్

కంటోన్మెంట్ బోర్డులో ఒక వ్యక్తి ఇల్లు నిర్మించుకోవాలంటే అనేక ఆంక్షలు ఉంటాయని, రక్షణ మంత్రిత్వ శాఖనే కొన్ని మార్పులు చేస్తుందని తద్వారా ఇల్లు నిర్మాణానికి అనుమతులు సులభతరం అవుతున్నాయని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయ ఆవరణలో ఆయన మాట్లాడుతూ లాల్ బజార్ లోని గాంధీ ఆడిటోరియంలో పేదవాళ్లు వివాహాలు చేసుకునే కమిటీ హాల్ ఉండేదని, గరీబోల్లు పెళ్లి చేసుకునే అడ్డాను గత పాలకులు బోర్డు సభ్యులు తీర్మానం చేసి డంప్ యార్డుగా మార్చారని, దాన్ని తక్షణమే కమ్యూనిటీ హాల్ గా సుందరమైన పార్కుగా తయారు చేసి పేదోల్లు పెళ్లిళ్లు చేసుకునేలా తయారు చేయిస్తానని తెలిపారు.

కాగా ప్రస్తుత డంపు యార్డును ఇతర ప్రాంతానికి తరలించేందుకు కృషి చేయాలని బోర్డు అధికారులకు సూచించానని తెలిపారు. గతంలో ఇంతకుముందు ఒక సెల్లార్ ఉంటే 2 సెల్లార్ల వరకు పర్మిషన్లు ఇచ్చామని ఇంతకు ముందు ఉన్న1.5 ఎఫ్ఎస్ఎల్ నుండి 2లేదా 2.5 ఎఫ్ఎస్ఎల్ వరకు అనుమతులు ఇచ్చేందుకు, గతంలో గ్రౌండ్ ప్లస్ 2 ఉంటే గ్రౌండ్ ప్లేస్ 3 వరకు అనుమతులు ఇద్దామని ఆలోచన ఉందని, కొద్దిగా స్థలం ఎక్కువ ఉన్నవారు పెద్దగా ఇల్లు కట్టుకోవాలంటే కొన్ని ఆంక్షలు ఉన్నాయని, ఇల్లీగల్ కట్టుకుంటే లంచాలు ఇవ్వవలసి వస్తుందని ఆ అంశాన్ని మార్చి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని బోర్డు అధికారులకు పాలకవర్గానికి సూచించినట్లు తెలిపారు. ప్రజలకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో అంత వరకు ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని కోరినట్లు తెలిపారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ బోర్డు సభ్యురాలు నర్మద

భవన నిర్మాణాలలో కంటోన్మెంట్ ప్రజలకు అనుమతులు అనుగుణంగా ఉండేందుకు కొన్ని ఆంక్షలు ఎత్తివేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 190 కోట్లు బకాయిలు ఉందని, ఆ నిధులు వచ్చినట్లయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ ద్వారా రక్షణ శాఖ నుండి అత్యధిక నిధులు తీసుకువచ్చి కంటోన్మెంట్ బోర్డ్ ను అభివృద్ధి చేస్తామన్నారు. కంటోన్మెంట్ నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం వలన అభివృద్ధి కుంటుపడుతుందని ఆరోపించారు. కంటోన్మెంట్ అభివృద్ధికి కోటి రూపాయల నిధులు ఎంపీ వద్ద నుండి తీసుకోవచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. సీఈఓ సంబంధిత అధికారులతో మాట్లాడి బోర్వెల్ లో విద్యుత్ బకాయిలకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. కంటోన్మెంట్ పరిధిలోని అన్ని కాలనీలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ఎంపీ నిధులు వినియోగిస్తామని అన్నారు. అభివృద్ధి చేయడంలో బీజేపీ ఎప్పుడు వెనకడుగు వేయలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజలను తప్పుదోవ పట్టించడానికే రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ పై తప్పుడు విమర్శలు చేస్తుందని ఆరోపించారు. కంటోన్మెంట్ కు ఉన్న బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించినట్లయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.

కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలతోనే అభివృద్ధి సాధ్యం.. ఎమ్మెల్యే శ్రీ గణేష్..

కంటోన్మెంట్ బోర్డులో ఎన్నికలు నిర్వహిస్తేనే ఈ ప్రాంత ప్రజల కనీస సౌకర్యాలు మెరుగుపడతాయని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. మంగళవారం బోర్డు కార్యాలయ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నివసించే 8 వార్డుల ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో బోర్డు సీఈఓ ఎలాంటి నిధులు లేవని మాట్లాడడం సరికాదని ఆరోపించారు. గతంలో పనిచేసిన ఎమ్మెల్యే, పాలకవర్గం బోర్డు సభ్యుల తప్పిదాల వల్లనే ఎంతో మంది పేద ప్రజలు వివిధ శుభకార్యాలకు ఉపయోగించుకునే కమ్యూనిటీ హాలును డంపింగ్ యార్డ్ గా మార్చారని అన్నారు. కాలనీలలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బోర్వెల్ లకు విద్యుత్తు సరఫరా బిల్లులు చెల్లించేందుకు బోర్డులో నిధులు లేవని సీఈఓ చెప్పడం ఎంత వరకు సమంజసమని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రజల కనీస సౌకర్యాలు తీర్చాలంటే బోర్డు ఎన్నికలు జరిగితేనే సాధ్యమవుతుందని, అంతే కాకుండా కంటోన్మెంట్ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కంటోన్మెంట్ బోర్డులో ఎమ్మెల్యే ఎంపీలకు ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల అటెన్షన్ మారుస్తు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు.

Similar News