పేట్ బషీరాబాద్ జర్నలిస్టుల భూమి పై కేటీఆర్, కవితల కన్ను : బండి సంజయ్
వందల కోట్లు రూపాయలు విలువచేసే పేట్ బషీరాబాద్ జర్నలిస్టుల భూమిపై కేటీఆర్, కవితల కన్ను పడిందని, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటైన విమర్శలు చేశారు.
దిశ, మేడ్చల్ ప్రతినిధి : వందల కోట్లు రూపాయలు విలువచేసే పేట్ బషీరాబాద్ జర్నలిస్టుల భూమిపై కేటీఆర్, కవితల కన్ను పడిందని, ఆ భూములను కొల్లగొట్టే ప్రయత్నంలో భాగంగానే కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు జర్నలిస్టులకు భూమిని కేటాయించకుండా పబ్బం గడుపుతున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటైన విమర్శలు చేశారు. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో జర్నలిస్టులకు కేటాయించిన భూములను ఆయన జర్నలిస్టు సంఘాల అభ్యర్థుల మేరకు శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 సంవత్సరాల క్రితం 11 వందల 7 మంది జర్నలిస్టులు అప్పటి ప్రభుత్వానికి విన్నవించుకోగా జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ పేరుమీద ఉన్న 70 ఎకరాల స్థలం కేటాయించిందని, అప్పట్లోనే జర్నలిస్టులు రెండు లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లిందని తెలిపారు. తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా వారికి భూమిని కేటాయించకపోవడం చూస్తుంటే ప్రభుత్వానికి జర్నలిస్టుల సంక్షేమం పై ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులను వాడుకొని ఇప్పుడు వారి సంక్షేమాన్ని పట్టించుకోకుండా విలేకరులను చిన్నచూపు చూస్తున్నాడని విమర్శించారు. టీవీ, పత్రికా యాజమాన్యాలను తన గుప్పిట్లో ఉంచుకొని తనకు అనుకూలంగా వార్తలను ప్రచారం చేసుకుంటూ విలేకరుల సంక్షేమాన్ని విస్మరించారని పేర్కొన్నారు.
అధికారంలోకి రాగానే ఇళ్ల స్థలాలు కేటాయింపు..
మరో ఆరు నెలల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, వెంటనే జర్నలిస్టులకు భూములు కేటాయించి వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తానని బండి సంజయ్ విలేకరులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నేతృత్వంలో అవసరమైన న్యాయ సహాయాన్ని జర్నలిస్టుల తరఫున బీజేపీ బాధ్యత వహించి న్యాయపోరాటం చేసే విధంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు.
జర్నలిస్టులలో ఐక్యతను దెబ్బతీసే యత్నం..
ప్రస్తుతం కేసీఆర్ జర్నలిస్టులలో ఐక్యతను దెబ్బతీసేందుకు జూనియర్ జర్నలిస్టు సీనియర్ జర్నలిస్టు అంటూ వేరుచేసి విలేకరుల మధ్య ఉన్న ఆరోగ్యకరమైన వాతావరణ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఈ ప్రయత్నాన్ని విలేకరులు కలిసికట్టుగా ఉండి వ్యతిరేకించాలని సూచించారు. నిత్యం సమాజంలో ఉండే సమస్యలను పరిష్కరించేందుకు విలేకరుల కృషి చేస్తున్నారని అటువంటి వారికి నేటికీ సరైన జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్న కొద్దిపాటి ఆస్తులను కూడబెట్టి ఒక్కో జర్నలిస్టు అప్పట్లోనే రూ రెండు లక్షల చెల్లించినప్పటికీ నేటికి వారికి లబ్ధి చేకూరలేదని తెలిపారు.
2015 లో, 2022 లో కోర్టు జర్నలిస్టులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ నిజాంపేటలో 33 ఎకరాలు మాత్రం కేటాయించి పేట్ బషీరాబాద్ లో మాత్రం స్థలం కేటాయించకపోవడం పై పెద్ద కుట్ర ఉన్నదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మేడ్చల్ రూరల్ బీజేపీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, అర్బన్ అధ్యక్షుడు హరీష్ రెడ్డి, జీడిమెట్ల కార్పొరేటర్ తారాచంద్రారెడ్డి, మాజీ అధ్యక్షుడు కొంపల్లి మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, అర్బన్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ఏనుగు తిరుపతి తదితరులు ఆయనతో ఉన్నారు.