జహీరాబాద్ సిగలో మరో మణిహారం.. స్మార్ట్ సిటీ మంజూరు చేసిన కేంద్రం

జహీరాబాద్ సిగలో మరో మణిహారం వచ్చి చేరింది.

Update: 2024-08-30 02:28 GMT

దిశ, జహీరాబాద్: జహీరాబాద్ సిగలో మరో మణిహారం వచ్చి చేరింది. రూ.2,361 కోట్ల నిధులతో "ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ" ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. భారీ పారిశ్రామిక ఉత్పత్తులు, ఉపాధి కల్పన లక్ష్యం పెద్ద సంఖ్యలో అభివృద్ధి ప్రణాళికలు జరుగుతున్నాయి. 10 సంవత్సరాల కిందట జహీరాబాద్ ప్రాంతానికి భారీ ఉత్పత్తులు, ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిమ్జ్ ( జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి ) మంజూరు చేసిన విషయం తెలిసింది. ఇందుకోసం నియోజకవర్గంలోని ఝరాసంగం , న్యాల్కల్ మండలాల్లో 17 గ్రామాల పరిధిలో 12,680.24 ఎకరాల్లో జాతీయ పెట్టుబడులు - ఉత్పాదక మండలి ( నిమ్జ్ ) ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

అనంతరం ఈ ప్రాంతంలో 'వెమ్ టెక్నాలజీని ' ఆయుధ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు యాజమాన్యం ముందుకు రాగా అప్పటి ఐటీ , పరిశ్రమలు , మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ నిమ్జ్ లో శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కొరియాకు చెందిన మరో కంపెనీ ఈవీ వాహనాల తయారు చేసే హుండాయ్ పరిశ్రమ యాజమాన్యం ముందుకొచ్చింది. నిమ్జ్ కు ఆనుకుని న్యాల్కల్ మండలంలో రెండు వేల ఎకరాల్లో ఫార్మా సిటీ కూడా అక్కడే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూసేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది.

భారీ సంఖ్యలో ఉద్యోగాలు...

పారిశ్రామికాభివృద్ధి కేంద్రంగా జహీరాబాద్ పట్టణాన్ని ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో రూ.2,361 కోట్లతో స్మార్ట్ సిటీని అభివృద్ధి చేయనున్నారు. ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీతో లక్షా 74 వేల మందికి ఉద్యోగ , ఉపాధి లభించే అవకాశాలున్నాయన్న అంచనా. నూతనంగా ఏర్పాటు చేయనున్న నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ (ఎన్ఐసీడీపీ) లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్) ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో జహీరాబాద్ పారిశ్రామికాభివృద్ధి కేంద్రంగా మారనుంది.

స్మార్ట్ సిటీకి కలిసొచ్చిన సరిహద్దు

ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉండటంతో అందరి దృష్టి ఈ గడ్డ మీదే పడ్డాయి. దానికి సరిహద్దు అంశం కలిసి వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణతోపాటు కర్ణాటకలోనూ పారిశ్రామికాభివృద్ధి జరుగునుంది. హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న నిమ్జ్ కేంద్రంగా ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మాణం జరగనుంది. మొత్తం రెండు దశల్లో, దాదాపు 12,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు విస్తరించనుంది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ & ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (ఎన్ఐసీడీఐటీ) ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా.. 3,245 ఎకరాల్లో మొదటి దశలో పనులు ప్రారంభం కానున్నాయి.

జాతీయ రహదారులు అదనపు ప్రయోజనం

స్మార్ట్ సిటీకి ఏర్పాటుకు జాతీయ రహదారులతో అదనపు ప్రయోజనం కలుగనుంది. స్మార్ట్ సిటీ లో ఉత్పత్తి అయిన ఉత్పత్తులు శరవేగంగా గమ్య స్థానాన్ని చేసేందుకు వీలుపడుతుంది. నూతనంగా ఏర్పాటు చేయనున్న స్మార్ట్ సిటీకి పూణే-మచిలీపట్నం జాతీయ రహదారికి (ఎన్ హెచ్-65) 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతోపాటుగా నిజాంపేట్-బీదర్ రాష్ట్ర రహదారి (ఎస్ హెచ్-16), జహీరాబాద్-బీదర్ రాష్ట్ర రహదారి (ఎస్ హెచ్-14) సమీపంలోనే ఉంది. హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుకు 65 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. అదేవిధంగా జహీరాబాద్ రైల్వేస్టేషన్ కు 19 కిలోమీటర్లు, మెటల్‌కుంట రైల్వేస్టేషన్ కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 125 కిలోమీటర్ల దూరంలో.. దేశ వ్యాపార రాజధాని ముంబైలోని జవహార్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ 600 కిలోమీటర్ల దూరంలో, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టు 620 కిలోమీటర్ల దూరంలో ఉంది. కీలకమైన గ్యాస్ ట్యాప్‌ ఆఫ్ పాయింట్ (పెట్రోలియం ఉత్పత్తుల మైన్ పైప్‌లైన్) కూడా జహీరాబాద్-బీదర్ మధ్యలో.. ప్రతిపాదిత ప్రాజెక్టుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ప్రభుత్వం వద్ద 80 శాతం భూమి

జహీరాబాద్‌లో నిమ్జ్ ప్రాతంలో ఇప్పటివరకు దాదాపు 3,500 ఎకరాలకు పైగా ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం. ఇక్కడ నిర్మించనున్న ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ మొదటి దశకు అవసరమైన 3,245 ఎకరాల భూమి అవసరం. ఇందుకు సంబంధించిన 3,100 (దాదాపు 80%) భూమి రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉంది. ఈ ప్రాజెక్టులో ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్, మెషినరీ, మెటల్స్, నాన్-మెటాలిక్ ఆధారిత పరిశ్రమలు, రవాణా తదితర రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చెందనున్నాయి. దీంతోపాటుగా ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ద్వారా.. లక్షా 74 వేల మందికి ఉపాధి లభించడం తో పాటుగా.. దాదాపు రూ.10వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు.


Similar News