MP Raghunandan Rao : తెల్లాపూర్ లో చెరువుల లెక్క తేల్చాల్సిందే
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెరువులలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువులను పునరుద్ధరించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు.
దిశ,పటాన్ చెరు : తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెరువులలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువులను పునరుద్ధరించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి లతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఆఫీస్ కు చేరుకున్న ఎంపీ రఘునందన్ తొలుత మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వస్తువుల ప్రదర్శనను తిలకించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తో పాటు మున్సిపల్ అధికారులతో సమావేశమైన ఎంపీ రఘునందన్ రావు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలపై రివ్యూ నిర్వహించారు.
ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్ మున్సిపాలిటీ లో భవన వ్యర్థాలను రోడ్లపై వేయడంతో పాటు చెరువులలో పారబోస్తున్నారని దీని పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా కాలనీలలోని మురుగునీటిని చెరువులు కుంటలలో వదలడం ద్వారా చెరువులు కంపు కొడుతున్నాయన్నారు. వెంటనే సదరు కాలనీలను గుర్తించి ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 15 తర్వాత మరొక సారి సమీక్ష నిర్వహిద్దామని ఆ లోపు తెల్లాపూర్ పరిధిలోని చెరువులు, కుంటలకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ల పూర్తి విస్తీర్ణం వివరాలు ఇవ్వాలని, చెరువుల చుట్టూ ఫెన్సింగ్ వేయాలని ఆదేశించారు.
చెరువులలో అక్రమ నిర్మాణాల తొలగింపులు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దని అవసరమైతే తాను ముందుండి చెరువుల పరిరక్షణలో పాల్గొంటానని స్పష్టం చేశారు. తెల్లాపూర్ లో రేడియల్ రోడ్డు సమస్యతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు, సబ్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్ విషయాన్ని స్థానికులు ఎంపీ ఆ దృష్టికి తీసుకుని రాగా సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. 30 పడకల ఆసుపత్రి విషయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రతిపాదనలు పెట్టామని, పాత మున్సిపల్ కార్యాలయంలో యుద్ధ ప్రతిపాదికన ప్రారంభించేలా చర్యలు తీసుకుంటారన్నారు. డిసెంబర్ వరకు తెల్లాపూర్ మున్సిపాలిటీ లో అభివృద్ధి పనుల అమలును కొలిక్కి తీసుకుని వచ్చి పూర్తయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.