ఎస్టీ కమిషన్ ఎదుటకు వెలిమల భూ వివాదం..
గత వారం రోజులుగా వరుసగా వివాదాస్పదమైన రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామంలోని మిగులు భూముల ఇష్యూ వివాదం కేంద్ర ఎస్టీ కమిషన్ దృష్టికి చేరింది.
దిశ, పటాన్ చెరు : గత వారం రోజులుగా వరుసగా వివాదాస్పదమైన రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామంలోని మిగులు భూముల ఇష్యూ వివాదం కేంద్ర ఎస్టీ కమిషన్ దృష్టికి చేరింది.
ఏండ్లుగా గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న భూముల్ని అన్యాయంగా బడా రియల్ వ్యాపారులకు కట్టబెట్టి రైతులను మోసం చేస్తున్న విషయం పై గతంలోనే స్థానికులు కేంద్ర ఎస్టీ కమిషన్ ఆశ్రయించారు. గత నవంబర్ లో ఈ వివాదం పై ఎస్టీ కమిషన్ బాధిత రైతులతో పాటు రెవెన్యూ అధికారులను ఢిల్లీ పిలిపించి విచారించింది. తిరిగి గత మంగళవారం సంగారెడ్డి ఆర్డీవో రవీందర్ రెడ్డితో పాటు రామచంద్రపురం తహశీల్దార్ సంగ్రామ్ రెడ్డిని కేంద్ర ఎస్టీ కమిషన్ ఢిల్లీకి విచారణకు పిలిచింది. అక్కడ జరిగిన విచారణ వివరాలను బుధవారం వెలిమల గ్రామ మాజీ సర్పంచ్ రాజ్య మహిపాల్ గౌడ్ వివరాలను వెల్లడించారు.
రామచంద్రపురం మండలం వెలిమల గ్రామ రెవెన్యూ పరిధిలోని 88 ఎకరాల బిల్లా దాకాల మిగులు భూములున్నాయని గత డెబ్బై, ఎనబై ఏళ్లుగా గిరిజన రైతులు సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. అయితే ఈ భూముల పై కన్నేసిన బడా వ్యాపారులు నిత్యానంద రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, విక్రమ్ కుమార్ రెడ్డి ఈ భూమిని తమ వశం చేసుకోవాలని స్కెచ్ వేశారన్నారు. ఈ బడా బాబులకు కొందరు రాజకీయ నేతల అండదండలు దొరకడంతో అన్యాయంగా తప్పుడు రిజిస్ట్రేషన్ లతో మిగులు భూములను కాజేశారని ఆరోపించారు. ఈ పూర్తి వ్యవహారాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో కేంద్ర ఎస్టీ కమిషన్ ఆశ్రయించడం జరిగిందన్నారు. గత నవంబర్లో ఎస్టీ కమిషన్ ఎదుట అధికారులతో పాటు బాధితులు హాజరయ్యారని, ఆ సమయంలో ఎస్టీ కమిషన్ గిరిజన రైతులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించినా ఫలితం లేకపోయిందన్నారు. మళ్లీ జనవరి 7 మంగళవారం సంగారెడ్డి ఆర్డీవో రవీందర్ రెడ్డి, రామచంద్రపురం తహసిల్దార్ సంగ్రామ్ రెడ్డిలతో పాటు బాధితులు, గ్రామస్తులు ఢిల్లీలో ఎస్టీ కమిషన్ ఎదుట హాజరయ్యారని వివరించారు.
ఈ విచారణలో గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో బడా బాబులకు కొత్త పాసు పుస్తకాలను ఇష్యూ చేయడం పై హాజరైన అధికారులను ఎస్టీ కమిషన్ ప్రశ్నించగా ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు కమిషన్ ఎదుట వివరించారన్నారు. అయితే ఈ తతంగం పై సీరియస్ అయిన ఎస్టీ కమిషన్ ఈ పూర్తి వ్యవహారం పై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్, సీసీఎల్ఏ కమిషనర్ వరకు బడా బాబులకు సహకరిస్తున్నారని కమిషన్ దృష్టికి బాధితులు తీసుకుని వెళ్ళారు. ఈ వ్యవహారం పై సీరియస్ అయినా ఎస్టీ కమిషన్ తప్పు తేలితే జిల్లా కలెక్టర్ తో పాటు బాధ్యులైన అధికారుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించిందన్నారు.
భూముల్లోనే బైఠాయించిన రైతులు..
గత మంగళవారం నుంచి పోలీస్ పహార మధ్య వందలాది ప్రైవేట్ సైన్యంతో తాము ఏండ్లుగా సాగుచేసుకుని జీవిస్తున్న భూముల్లో అక్రమంగా కొందరు బడాబాబులు చొరబడే ప్రయత్నం చేస్తున్నారని వెలిమల తండావాసులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తమతండ్రులు తాతల కాలం నుంచి ఈ భూముల పైన ఆధారపడి బతుకుతున్నామని ఇప్పుడు కొందరు అధికారులు బడా వ్యాపారవేత్తలకు సహకరిస్తూ తమ భూముల్ని అన్యాయంగా వారి పేరు పైన రిజిస్ట్రేషన్ చేశారని మండిపడ్డారు. మంగళవారం జరుగుతున్న పనులను ఆపే ప్రయత్నం చేయగా నిర్దాక్షిణ్యంగా తమను పోలీసులు పక్కకు లాగి పడేశారని ఆరోపించారు.
తమ భూములు తమకు దక్కేవరకు తమ పోరాటం ఆపబోమని, తమ ప్రాణాలు తీసి ఈ భూముల్ని లాక్కోవాలని కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పైన కరుణ చూపి తమ భూముల్ని తమకు అప్పగించాలని వేడుకున్నారు.
మా భూమిని లాక్కోవడం అన్యాయం : రమేష్ రైతు
మా తండ్రులు తాతల కాలం నుండి ఇదే భూముల్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి కొందరు వ్యాపారులు తమ భూములను లాక్కోవడం అన్యాయం. గత రెండేళ్ల కింద రెవెన్యూ అధికారులు తమకు పట్టాలు అందిస్తామని ప్రలోభాలకు గురిచేసి తమతోనే సర్వేనెంబర్ 424 చుట్టూ ఫెన్సింగ్ వేయించారు. ఇప్పుడు తమను మోసం చేసి పక్కనున్న మిగులు భూమిని విక్రం రెడ్డి తోపాటు నిత్యానంద రెడ్డి, కళ్యాణ్ రెడ్డికి కట్టబెడుతున్నారు. మా భూములు మాకే దక్కాలి మా ప్రాణాలు పోయిన భూములను వదిలే ప్రసక్తే లేదు.