రైతుల సమస్యలు గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం : ఎమ్మెల్యే రఘునందన్ రావు
రైతుల సమస్యలు గాలికి వదిలేసి, రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో కూర్చుని సమీక్షలు నిర్వహించేందుకు మాత్రమే పరిమితమైందని ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు ఆరోపించారు.
సమీక్షలు నిర్వహించేందుకే మంత్రులు పరిమితం
దిశ, దుబ్బాక : రైతుల సమస్యలు గాలికి వదిలేసి, మంత్రులు హైదరాబాద్ లో కూర్చుని సమీక్షలు నిర్వహించేందుకు మాత్రమే పరిమితమయ్యారని ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని మంగళవారం మార్కెట్ యార్డును ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రోహిణి కార్తె ప్రారంభమైనా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు అదేవిధంగా ఉండడం చూస్తే అధికారుల నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనిపిస్తోందన్నారు.
రైతు ప్రభుత్వమని చెప్పుకునే బీఆర్ఎస్ ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేసేందుకు ఎందుకు విఫలమైందని ప్రశ్నించారు. రాత్రి కురిసిన అకాల వర్షానికి దుబ్బాక నియోజకవర్గంలో మండలాలలోని పలు గ్రామాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయిందన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత రెండు నెలల క్రితం ఈదురు గాలులతో లేచిపోయిన దుబ్బాక మార్కెట్ యార్డు గోదాం రేకులను తిరిగి వెంటనే బాగుచేయాలని సంబంధిత అధికారులను కోరినప్పటికి ఇంత వరకు పనులు ప్రారంభించ లేదన్నారు.
కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై నాణ్యత లోపంతో నిర్మించిన గోదాముల వల్ల రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ ఉండడానికి పనికి రాకుండా పోయిందన్నారు. రైతే రాజ్యం అని చెప్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలును త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బలేష్ గౌడ్, బీజేపీ జిల్లా కార్యదర్శి కిష్టమ్మ గారి సుభాష్ రెడ్డి, ఎంపీటీసి పరికి రవి గౌడ్, స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ దూలం వెంకట్ గౌడ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సుంకోజి ప్రవీణ్ కుమార్, కోమటి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రమేష్ రెడ్డి, పుట్ట వంశీ, మాధవనేని భాను ప్రసాద్, పల్లె నేహాల్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.