Harish Rao: మత్స్య పారిశ్రామిక సోసైటీలు.. వాటికి ఇబ్బంది లేకుండా కొత్తవి: హరీష్ రావు
దిశ ప్రతినిధి, సంగారెడ్ది: ఎన్నో ఏళ్ల నుంచి కొత్త మత్స్య పారిశ్రామిక సొసైటీలను ఏర్పాటు చేయాలని, నూతన సభ్యత్వాలు.. Minister Harish Rao Announced state government to be built new societies for fisheries
Minister Harish Rao Announced state government to be built new societies for fisheries
దిశ ప్రతినిధి, సంగారెడ్ది: ఎన్నో ఏళ్ల నుంచి కొత్త మత్స్య పారిశ్రామిక సొసైటీలను ఏర్పాటు చేయాలని, నూతన సభ్యత్వాలు ఇవ్వాలని మత్స్య కార్మికుల నుంచి డిమాండ్ ఉందని అయితే గతంలో పాలించిన ఏ ప్రభుత్వాలు వారి డిమాండ్ పట్టించుకోలేదని, కానీ సీఎం కేసీఆర్ మాత్రం మత్స్య కార్మికుల సమస్యలు, డిమాండ్లపై స్పందించారని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు(Harish Rao) అన్నారు. అంతేకాకుండా ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణనే అని ఆయన తెలిపారు. హైదరాబాద్ MCRHD లో ఉమ్మడి మెదక్(Medak) జిల్లా ప్రజాప్రతినిధులు, ఫిషరీస్ అధికారులతో హరీష్ రావు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత నీటి వనరులు పెరిగాయని, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు, ఇతర పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేయడంతో నీట వనరులు గణనీయంగా పెరిగాయన్నారు. ప్రతి చెరువు కాళేశ్వరం నీటితో కళకళలాడుతోందని, చెక్ డ్యాంలు పెద్ద ఎత్తున జిల్లాలో నిర్మించామని మంత్రి స్పష్టం చేశారు. నీటి వాగుల్లో వీటిలో చేపల పెంపకం ద్వారా మత్స్యకార కుటుంబాలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు. కొత్తగా పెరిగిన నీటి వనరుల వల్ల ఆయా గ్రామాల్లో చేపల పెంపకం చేపట్టవచ్చునని, అలాంటి నీటి వనరులు ఉన్న చోట కొత్త మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్(KCR) ఆదేశించినట్లు హరీష్ రావు వెల్లడించారు.
నీటి వనరులు లేనప్పుడు రెండున్నర ఎకరాలకు ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేశారని, ఇప్పుడు నీటి వనరులు పెరగడంతో ఎకరానికి ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ఈ లెక్కన కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయడంతో పాటు, పాత సోసైటీల్లోను ఎకరానికి ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయాల్సి ఉందని, దీని వల్ల పాత సొసైటీల్లోను కొత్తగా సభ్యులను ఎంపిక చేసుకునే వీలు కలిగిందన్నారు.
కొత్తగా 712 నీటి వనరుల సొసైటీలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంకా 712 నీటి వనరులు సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉందని మంత్రి చెప్పారు. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం 281 సోసైటీలు ఉండగా అందులో 20731 మందికి సభ్యత్వం ఉంది. ఈ సొసైటీలు జిల్లాలోని 1,255 నీటివనరులను వినియోగించుకుంటున్నాయి. ఇంకా 381 నీటి వనరులకు సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. అలాగే మెదక్ జిల్లాలో 263 సొసైటీల్లో 15,724 మంది సభ్యులు ఉన్నారు. ఈ సొసైటీలు జిల్లాలోని 1,379 నీటి వనరులను వినియోగించుకుంటున్నాయి. ఇంకా 235 నీటి వనరులకు కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.
సంగారెడ్డి జిల్లాలో 193 సొసైటీల్లో 10,434 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఘాలు 875 నీటి వనరులను వినియోగించుకుంటున్నాయి. ఇంకా 196 నీటి వనరులకు సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉందని హరీష్ రావు వెల్లడించారు. మండలాలు, నియోజకవర్గాల వారీగా నీటి వనరులు ఎలా ఉన్నాయో లెక్క తెల్చాలని ఫిషరీస్ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఏ చెరువు వర్షం మీద ఆధారపడి ఉంది..? ఏ చెరువుకు కాలువల నీరు చేరుతుందన్న సమాచారం సేకరించాలన్నారు. ఏ సోసైటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు..? కొత్తగా ఎంత మందిని చేర్చుకోవచ్చు..? అన్న సమాచారం పక్కాగా సేకరించాలని ఆదేశించారు. కొత్తగా సభ్యత్వం చేపట్టడం, కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయడం వల్ల మత్స్య కార్మికులకు ఎన్నో ఉపయోగాలున్నాయన్నారు.
సొసైటీలో సభ్యులు ఎక్కువ మంది ఉంటే బీమా సౌకర్యం ఉంటుందని, రుణ సౌకర్యం సులువుగా లభిస్తుందని, ప్రభుత్వ సబ్సిడీ పథకాలు అందరికీ వర్తిస్తాయని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీలు బండా ప్రకాశ్, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, క్రాంతి కిరణ్, మదన్ రెడ్డి, మాణిక్ రావు, ఎమ్మెల్సీలు యాదవ్ రెడ్డి, పారూఖ్ హుస్సెన్, భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, ఫిషరీష్ శాఖ కమిషనర్ లచ్చిరామ్ భూక్యా, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.