Siddipet Collector : ట్రాన్స్ జెండర్ల జీవనోపాధికి ప్రాధాన్యత
ట్రాన్స్ జెండర్ల జీవనోపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం
దిశ,సిద్దిపేట ప్రతినిధి : ట్రాన్స్ జెండర్ల జీవనోపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ట్రాన్స్ జెండర్ లకు స్వయం ఉపాధి నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్ స్విచ్ ఎకో సంస్థ ప్రతినిధి అక్షయ్ నైపుణ్య శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సమాజంలో వివక్షతను ఎదురుకాకుండా తమ కాళ్ళ పై తాము నిలబడేందుకు ట్రాన్స్ జెండర్ల కు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
జిల్లాలో దాదాపు 100 మందికి పైగా ట్రాన్స్ జెండర్లు ఉన్నారని వ్యక్తిగతంగా ఎవరికి ఇష్టమైన ఉపాధి యూనిట్ ను నిర్ణయించుకుంటే అందజేస్తామని లేదా అందరికీ కలిపి ఒకే పనిలో ఉపాధి పొందాలనుకుంటే వ్యవసాయ అనుబంధ రంగాలు లేదా ఇతర రంగాల్లో ప్రత్యేకమైన ఉపాధి యూనిట్ ను ప్రారంభించి ఉపాధి కల్పిస్తామన్నారు. డీఆర్డీఏ ద్వారా కూడా పాడి ఆవుల పెంపకం, పౌల్ట్రీ ఫామ్, క్యాంటీన్ నిర్వహణ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు, ఈవెంట్ మేనేజ్‌మెంట్, బ్యూటీ పార్లర్, మిల్క్ పార్లర్ లాంటి యూనిట్ల ద్వారా అవకాశాలను కల్పిస్తామని అన్నారు. ట్రాన్స్ జెండర్ లకు ప్రత్యేక ఇండ్లు లేనందున వారికి ఇండ్ల స్థలాలను అందించేందుకు కృషి చేస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శారద తదితరులు పాల్గొన్నారు. అనంతరం వికలాంగులకు స్వయం ఉపాధి కల్పన కోసం రూ.50 వేల సబ్సిడీ చెక్కులను కలెక్టర్ అందజేశారు.