సమీకృత మార్కెట్ కు నిదుల కొరత.. నెరవేరని ప్రభుత్వ లక్ష్యం...
ప్రజల సౌకర్యార్థం కూరగాయలు మాంసం చేపలు విక్రయాలు ఒకే చోట విక్రయించాలని మంచి లక్ష్యంతో గత ప్రభుత్వం నర్సాపూర్ పట్టణానికి సమీకృత మార్కెట్ మంజూరు చేసింది.
దిశ, నర్సాపూర్ : ప్రజల సౌకర్యార్థం కూరగాయలు మాంసం చేపలు విక్రయాలు ఒకే చోట విక్రయించాలని మంచి లక్ష్యంతో గత ప్రభుత్వం నర్సాపూర్ పట్టణానికి సమీకృత మార్కెట్ మంజూరు చేసింది. గత ప్రభుత్వంలో ఎంతో ఆర్భాటంగా పనులకు శంకుస్థాపన చేశారు. ఏడాదిలోపు పనులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాల్సి ఉండగా బిల్లు రాక కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు.
దీని నిర్మాణానికి ముందుగా రూపాయలు ఆరు కోట్లు మంజూరు చేశారు. దీంట్లో నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ కార్యాలయానికి కేటాయించారు. మిగతా రెండు కోట్లతో పనులు చేపట్టినప్పటికీ చేసిన పనులకు సక్రమంగా బిల్లులు రాకపోవడంతో సదర్ కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే ఆపివేశాడు.
పలు ఏరియాలో కూరగాయల విక్రయం..
అయితే నర్సాపూర్ పట్టణంలోని అంజిరెడ్డి హాస్పిటల్ నుంచి షాది ఖానా వరకు ఒక రూట్లో కూరగాయలను విక్రయిస్తున్నారు. అలాగే పాత మార్కెట్లో కొద్దిమేర కూరగాయలను విక్రయిస్తున్నారు. వేరువేరుగా ఏర్పాటు చేసిన కూరగాయల దుకాణాల వద్ద కొనుగోలు చేయడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి శుక్రవారం మంగళవారం రెండు రోజులపాటు వారాంతం సంతను నిర్వహిస్తున్నారు. సాయంత్రం సమయంలో ఈ ఏరియాలకు మున్సిపల్ సిబ్బంది వెళ్లి తడి పొడి చెత్తను సేకరిస్తున్నారు. అలాగే పాత మటన్ మార్కెట్ భవనాలను అధికారులు కూల్చివేయడంతో పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్న మార్కెట్ స్థలంలోనే రోడ్డుపైనే విక్రయాలు కొనసాగిస్తున్నారు. కాగా చాపల మార్కెట్ను ఒకటవ నంబర్ కల్లు దుకాణం సమీపంలో మురికి కాలువల పక్కన చాపలను విక్రయిస్తున్నారు.