Konda Surekha: కామన్ డైట్ మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ వల్లూరు క్రాంతి
రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు రుచికరమైన పౌష్టికాహారం అందించేలా ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలు, సంక్షేమ గురుకుల పాఠశాలల్లో నూతన మెనూ అమల్లోకి తీసుకు వచ్చిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
దిశ, సంగారెడ్డి/హత్నూర : రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు రుచికరమైన పౌష్టికాహారం అందించేలా ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలు, సంక్షేమ గురుకుల పాఠశాలల్లో నూతన మెనూ అమల్లోకి తీసుకు వచ్చిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెంచరీ జూనియర్ కళాశాల, తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు అందించే డైట్ చార్జీల పెంపు, కామన్ డైట్ మెనూ కార్యక్రమాన్ని మంత్రి కొండా సురేఖ ,జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో వసతి గృహాలలో నూతన మెనూ ప్రకారం భోజనాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు అధికారులు భాగస్వాములు అయ్యారని అన్నారు. గురుకుల విద్యార్థులకు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆడపిల్లలకు మంచి డైట్ ఇవ్వాలి, కానీ గత ప్రభుత్వం వారికి ఇవ్వలేదన్నారు. దీంతో బాలికలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. 16 సంవత్సరాలుగా పెరుగని డైట్ చార్జీలను, కాస్మెటిక్ చార్జీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం పెంచిందన్నారు. ప్రతిరోజు విద్యార్థులకు అందించే భోజనంలో నూతన మెనూ ప్రకారం చికెన్, గుడ్డు, మటన్ లలో ఏదో ఒకటి ఉండేలా మెనును రూపొందించినట్లు మంత్రి తెలిపారు. మెనూ ప్రకారం తప్పనిసరి భోజనాలు అందించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వానికి పిల్లల ఆరోగ్యమే ముఖ్యం అన్నారు. నూతన డైట్ విధానం వల్ల ప్రభుత్వాన్ని పై కోట్ల రూపాయల భారం పడుతున్నప్పటికీ పిల్లలు ఆరోగ్యాన్ని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాకు రెండు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు అయ్యాయన్నారు. పిల్లలను తల్లిదండ్రులు తిట్టవద్దు అని, మార్కులు రాకపోయినా బుజ్జగించి నచ్చ చెప్పాలన్నారు. ప్రస్తుతం విద్యార్థులు చాలా సున్నితంగా తయారయ్యారని, పిల్లలతో కుటుంబ సభ్యులకు మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకోవాలి అన్నారు. అప్పుడే విద్యార్థులు మంచి నడవడికతో ఉత్తమ పౌరులుగా మారతారన్నారు.
విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి: కలెక్టర్ వల్లూరు క్రాంతి
ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలు గురుకుల పాఠశాల విద్యార్థులు డైట్ చార్జీలు, కాస్మొటిక్ ఛార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూస్తున్నదని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. ఎనిమిది సంవత్సరాల తర్వాత డైట్ చార్జీలు, 16 సంవత్సరాల తర్వాత కాస్మోటిక్ చార్జీలు పెరిగాయన్నారు. దీంతో పాటు విద్యార్థులకు కామన్ మెనూ ప్రభుత్వం రూపొందించింది అన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా ఆకుకూరలు, గుడ్లు, చికెన్ ,మటన్, నెయ్యి పప్పు దినుసులు ఉండేలా ప్రభుత్వం కామన్ మెనూ రూపొందించింది అన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ప్రతి రోజు భోజనం అందించేలా చూడాల్సిన బాధ్యత గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, సంక్షేమ అధికారులదే అని అన్నారు. హత్నూర సోషల్ వెల్ఫేర్ కళాశాలలో విద్యార్థులకు నీట్, ఐఐటీ కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ ర్యాంకుల సాధనలో హత్నుర్ కళాశాల సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచిందన్నారు. తాను సైతం సంక్షేమ వసతి గృహంలో చదువుకొని ఐఐటీలో 936 ర్యాంక్ సాధించి ఢిల్లీ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి సివిల్స్ లో ఐఏఎస్ గా ఎంపికైనట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ స్వప్న, ఆర్ డీఓ రవీందర్ రెడ్డి, ప్రిన్సిపల్ మధుసూదన్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీకాంత్, ఆర్ సీలు, ఆర్ఐ శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.