కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద కుంభకోణం : మంత్రి దామోదర్
లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద కుంభకోణమని స్వయాన దేశ ప్రధానినే అంటున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ. దామోదర్ రాజనర్సింహ అన్నారు.
దిశ, అందోల్: లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద కుంభకోణమని స్వయాన దేశ ప్రధానినే అంటున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ. దామోదర్ రాజనర్సింహ అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులకు క్రాక్‌లు వచ్చాయని, అవి నీటి మునిగే అవకాశాలున్నాయన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని రూ.138.11 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పాలనలో ప్రాజెక్టుల పేరిట రూ.లక్షల కోట్లను దోచుకున్నారని, గత తొమ్మిదేళ్ల పాలనలో అవినీతి, మోసం, అబద్దాలు, దోపిడీ జరిగిందని ఆయన విమర్శించారు. 60 ఏండ్ల సుధీర్ఘ పోరాటంలో సాధించుకున్న తెలంగాణతో బతుకులు మారుతాయనుకుంటే అంతా అవినీతిమయమైందన్నారు.
రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా తయారు చేసింది బీఆర్‌ఎస్ పార్టీయేనన్నారు. కాంగ్రెస్ పాలనలో నిర్మించిన నాగార్జున సాగర్, పోచంపాడ్, సింగూర్ ప్రాజెక్టులు వంటివి నిర్మిస్తే ఏనాడు వాటిపై ఏలాంటి ఫిర్యాదులు రాలేవని, నష్టం జరగలేదని, నిర్మాణంలో ఏలాంటి లోపం లేదన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో స్వేచ్చ నిర్భందం ఉండేదని, ఏవరైన మాట్లాడితే సమస్యను చూపిస్తే పోలీసులతో అణిచి వేయించే వారని, ప్రజలకు బీఆర్‌ఎస్ మంత్రులు కలిసే వారు కారని, కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని, గతంలో మాదిరిగానే సెక్రటరీయేట్‌కు మంత్రులుగా మేము వేళ్తున్నామని, ప్రజల నుంచి ఆర్జీలు తీసుకుంటున్నామని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.
40 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ లబ్ది:
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన 200 యూనిట్‌ల ఉచిత విద్యుత్‌తో రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుందన్నారు. జీరో బిల్లులను లబ్దిదారులకు మంత్రి దామోదర్ అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్ధానాన్ని నిలుబెట్టుకోవడంలో ముందుంటుందన్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 168903 కుటుంబాలకు, జోగిపేట డివిజన్ పరిధిలో 29832 కుటుంబాలకు ఉచిత విద్యుత్‌కు అర్హులని ఆయన తెలిపారు.
మార్చి 11న మరో గ్యారంటీని అమలు చేస్తాం:
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పామని, ఆ దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇప్పటివరకు మహిళలకు ఆర్‌టీసీ ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంపు, రూ.500లకే గ్యాస్ సిలీండర్, 200 యూనిట్‌ల ఉచిత విద్యుత్‌లను అమలు చేస్తున్నామన్నారు. మార్చి 11న ఇందిరమ్మ ఇండ్ల పేరిట పేదలకు జాగా ఉన్న వారికి రూ. 5 లక్షలు, స్థలాలు లేని వారు 100 గజాల స్థలాన్ని ఇవ్వబోతున్నట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మార్చి 17నాటికి 100 రోజులు కాబోతుందని, అప్పటిలోగా ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చే దిశగా ప్రయత్నం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, మాజీ ఎంపీ సురేష్ షేట్కార్, ఆర్‌అండ్‌బీ ఈఈ రాంబాబు, ఈపీహెచ్ వీరప్రతాప్, డీసీహెచ్‌ఓ సంగారెడ్డి, ఆర్‌డీవో పాండు, టీఎస్‌ఈడబ్లు్యఐడీసీ డిప్యూటీ ఈఈ రాంకుమార్, కమిషనర్ తిరుపతి, చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ డేవిడ్, కౌన్సిలర్‌లు ఎస్.సురేందర్‌గౌడ్, రంగ సురేష్, ఆకుల చిట్టిబాబు, డాకూరి శంకర్, పి.రేఖా ప్రవీణ్, హరికృష్ణ గౌడ్, నాగరాజ్, దుర్గేష్, చందర్, ఆర్.భవానీ నాగరత్నంగౌడ్, ఉల్వలు మాధవి వెంకటేశంతో పాటు తదితరులు పాల్గొన్నారు.