బ్లాక్ మెయిల్ చేస్తే...ప్రశ్నించడం ఆగదు : హరీష్ రావు
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్నారని, బ్లాక్ మెయిల్ చేస్తే ప్రశ్నించడం ఆగదని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఫైర్ అయ్యారు.
దిశ, ఆందోల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్నారని, బ్లాక్ మెయిల్ చేస్తే ప్రశ్నించడం ఆగదని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఫైర్ అయ్యారు. గురువారం సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం మాసానిపల్లి లోని పెద్దమ్మ తల్లి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రేవంత్ ప్రభుత్వం హామీలపై ప్రశ్నించే గొంతుకలను నొక్కిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేసేందుకే ప్రజలు మాకు ప్రతిపక్ష హోదాను ఇచ్చారని, ఎన్ని అడ్డంకులు సృష్టించిన, ప్రజల పక్షాన నిలదీస్తూనే ఉంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ తరపున మా పోరాటం ఆగదన్నారు. రంగనాయక చెరువు కబ్జా చేశారని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
రైతుల దగ్గర నుంచి పట్టా భూమిని 11 ఎకరాలు కొనుగోలు చేశానని, వారు చూపించిన భూమిలోనే కబ్జాలో ఉన్నానన్నారు. ప్రభుత్వం, ఇరిగేషన్ భూములు నా దగ్గర లేవని, గుంట, ఎకరం భూమిని కూడా కబ్జా చేయలేదన్నారు. నువ్వు ఎప్పుడు వస్తావో రా.... ఇద్దరం కలిసి సర్వే చేయిద్దాం, గుంట భూమి ఎక్కువున్నా ఇచ్చేస్తానని ఆయన అన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, మాజీ డిసిసిబి వైస్ చైర్మన్ జైపాల్ రెడ్డి, సినీ హీరో, నాయకుడు ఉదయ్ బాబుమోహన్, మాజీ జడ్పీ చైర్మన్ బాలయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ లు పి.నారాయణ, డీబీ. నాగభూషణం, నాయకులు వెంకటేశం, యదకిషన్ తదితరులు పాల్గొన్నారు.
సగం వడ్లు దళారులకే
రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా 90 లక్షల మెట్రిక్ టన్నుల కొంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారని, 70 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని సివిల్ సప్లయ్ కమిషనర్ చౌహన్ చెప్పారని, మిగతా 20 లక్షల మెట్రిక్ టన్నులు దళారులకే వెళ్లినట్లేనా అని ఆయన ప్రశ్నించారు. కొంటానని చెబుతున్న 70 లక్షలమెట్రిక్ టన్నులలో కూడా సగం వడ్లను కొనుగోలు చేయదని ఆయన అన్నారు. సకాలంలో కేంద్రాలను తెరవక, మిల్లర్లను సమాయత్తం చేయకపోవడం, గన్ని బ్యాగులు ఇవ్వకపోవడంతో రైతులు దళారులకు రూ.400 నుంచి రూ.500 లకు తక్కువకు వడ్లను అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.