ప్రభుత్వ జాగలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు
ప్రభుత్వ జాగలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి తహసీల్దార్ దేవదాస్ హెచ్చరించారు.
దిశ, సంగారెడ్డి : ప్రభుత్వ జాగలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి తహసీల్దార్ దేవదాస్ హెచ్చరించారు. సంగారెడ్డి పట్టణంతో పాటు, మండల పరిధిలో కూడా ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా ప్రభుత్వ జాగలు ఆక్రమిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. గతంలో ఎర్రకుంటలో అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేశామని, ప్రభుత్వ భూముల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో కల్వకుంట, ఎర్రకుంట, రెవెన్యూ కాలనీలో ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే వాటిని కూల్చివేసి ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవ్వరూ ప్రభుత్వ జాగలను ఆక్రమించరాదని, అధికారులకు సహకరించాలని సూచించారు. లేనిచో ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.