గిరిజనుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం గిరిజనుల ఆర్థిక అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
దిశ, పటాన్ చెరు : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం గిరిజనుల ఆర్థిక అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు భోజ్యా తండాలో నూతనంగా నిర్మించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్, భవాని మాత దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఆరు తండాలలో సొంత నిధులతో సేవాలల్ మహారాజ్, భవాని మాత దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పలు తండాలలో దేవాలయాల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి గిరిజనులకు సైతం రాజకీయాల్లో సమ అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, స్థానిక కౌన్సిలర్లు, తండావాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.