ప్రభుత్వ ఉద్యోగులను అవమానించేలా మాజీ మంత్రి వ్యాఖ్యలు
రైతు బంధు డబ్బులు ఆపి ఏసీ రూములో కూర్చునే ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు చెల్లించింది అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎస్‌టీయూ మెదక్ జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పోచయ్య, రాష్ట్ర కార్యదర్శి ఎర్ర రాజు అసోసియేట్ అధ్యక్షులు శివప్రసాద్, అరుణ్ కుమార్, ఎల్లం అన్నారు.
దిశ, మెదక్ ప్రతినిధి: రైతు బంధు డబ్బులు ఆపి ఏసీ రూములో కూర్చునే ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు చెల్లించింది అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎస్‌టీయూ మెదక్ జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పోచయ్య, రాష్ట్ర కార్యదర్శి ఎర్ర రాజు అసోసియేట్ అధ్యక్షులు శివప్రసాద్, అరుణ్ కుమార్, ఎల్లం అన్నారు. గురువారం వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడుతున్న ఉద్యోగులను ఇది అవమానించడమే అని వారు తెలిపారు. రైతు బంధుకు తాము వ్యతిరేకం కాదు, కానీ రైతులకు ఉద్యోగుల జీతాలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. గతంలో కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల జీతాల పై దుష్ప్రచారం చేసి ప్రజల్లో ఉద్యోగుల పట్ల వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేసిందని, ప్రస్తుతం హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయని అన్నారు.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించటంలో ఉద్యోగ ఉపాధ్యాయుల పాత్ర కీలకం అనీ, మొత్తం ఉద్యోగులలో కొద్ది మంది పై స్థాయి ఉద్యోగులు మాత్రమే ఏసీ రూముల్లో కూర్చుని పని చేస్తారని, మెజారిటీ ఉద్యోగులు , ఉపాధ్యాయులు క్షేత్ర స్థాయిలో, ఆఫీస్‌లలో, పాటశాలల్లో కనీస వసతులు లేని పరిస్థితుల్లో పనిచేసే విషయాన్ని మాజీ మంత్రి గుర్తించాలని, గత ప్రభుత్వం జీతాలు ఆలస్యంగా చెల్లించటం మూలంగా బ్యాంక్ లోన్లు సమయానికి కట్టలేక ఫైన్ చెల్లించామని, క్రెడిట్ స్కోర్ పడిపోయి బ్యాంకుల్లో అప్పు పుట్టని పరిస్థితి నుంచి ప్రస్తుత ప్రభుత్వం దానిని సరి చేస్తుంటే బీఆర్‌ఎస్ నాయకులు ఇలా ప్రజలను ఉద్యోగుల పైకి ఉసిగొల్పి ప్రయోజనం పొందాలనుకోవటం బాధాకరమని అన్నారు.