భక్తులతో జనసంద్రమైన ఏడుపాయల క్షేత్రం

జనమేజయుని సర్పయాగస్థలిగా వినుతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయం.. ఆధ్యాత్మిక వాతావరణం.. ఆలయం చుట్టూ పచ్చని చెట్లు, గలగల పారే గంగమ్మ పరవళ్ళు.. ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నామనిపించే వాతావరణం.. ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత క్షేత్రం సొంతం.

Update: 2025-04-13 10:41 GMT
భక్తులతో జనసంద్రమైన ఏడుపాయల క్షేత్రం
  • whatsapp icon

దిశ, పాపన్నపేట : జనమేజయుని సర్పయాగస్థలిగా వినుతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయం.. ఆధ్యాత్మిక వాతావరణం.. ఆలయం చుట్టూ పచ్చని చెట్లు, గలగల పారే గంగమ్మ పరవళ్ళు.. ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నామనిపించే వాతావరణం.. ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత క్షేత్రం సొంతం. ఆదివారం వారాంతపు సెలవు రోజు కావడంతో ఏడుపాయలకు భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలు భక్తులతో జనసంద్రమైంది. ఆలయ అర్చకులు వేకువజామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి భక్తులకు వనదుర్గమ్మ దర్శనం కల్పించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాలు, జంట నగరాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మ దర్శనానికి తరలివచ్చారు. చెక్ డ్యామ్, అమ్మవారి ప్రధాన ఆలయం ముందున్న మంజీర నది పాయలో పుణ్యస్నానాలు ఆచరించి వనదుర్గాదేవి దర్శనానికి బారులు తీరారు. పలువురు భక్తులు అమ్మవారికి డప్పుచప్పుల్ల మధ్య బోనాలు, ఒడి బియ్యం సమర్పించారు. మరికొందరు భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఏడుపాయల వన దుర్గాదేవి క్షేత్రం హోరెత్తింది. చల్లంగా చూడమ్మా.. వన దుర్గమ్మ తల్లి అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. ఆలయ అర్చకులు పూజలు చేపట్టి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సిబ్బంది భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు.

Similar News