తాగునీటికి తండ్లాట

ప్రతీ రోజు నీటి కోసం పనులు వదులుకొని తిరుగుతున్నాం. మిషన్ భగీరథ నీరు రావడం లేదు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.

Update: 2024-11-23 12:11 GMT

దిశ, కోహెడ : “ప్రతీ రోజు నీటి కోసం పనులు వదులుకొని తిరుగుతున్నాం. మిషన్ భగీరథ నీరు రావడం లేదు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇన్నేళ్లలో ఎప్పుడు ఇలాంటి గోస చూడలేదంటూ” బస్వాపూర్ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. మంచినీటి ట్యాంకు నిరుపయోగంగా మారింది. మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. శనివారం కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో గత రెండు నెలల నుంచి తాగునీటి కట కటతో తీవ్ర ఇబ్బంది ఏర్పడగా సహనం కోల్పోయిన మహిళలు గ్రామ పంచాయతీని ముట్టడించారు. తమ నీటి సమస్య పట్టించుకోని అధికారులను నిలదీయగా అందుబాటులో నోడల్ అధికారులు లేరని, ఇంచార్జి గ్రామ సెక్రటరీ మహిళలను సముదాయించి త్వరలో జిల్లా ఉన్నతాధికారులకు సమస్యలు తెలియజేసి నీటి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. తమ గ్రామానికి పూర్తి స్థాయి గ్రామ సెక్రటరీని నియమించి గ్రామంలో సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులు అందుబాటులో ఉండాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు.


Similar News