Collector Rahul Raj : వనమహోత్సవంలో జిల్లా ప్రజలు భాగస్వామ్యం కావాలి..
స్వచ్ఛదనం -పచ్చదనంలోని వనమహోత్సవ ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
దిశ, తూప్రాన్ : స్వచ్ఛదనం -పచ్చదనంలోని వనమహోత్సవ ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్, మల్కాపూర్, తూప్రాన్ పట్టణంలో శుక్రవారం స్వచ్చదనం - పచ్చదనంలోని వన మహోత్సవ ముగింపు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆయా గ్రామాల్లో మొక్కలు నాటారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. గ్రామాల్లోని పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ వన మహోత్సవంలో మెదక్ జిల్లా ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. జిల్లాలో 34 లక్షల మొక్కలు నాటేలా లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో 80 శాతం లక్షల మొక్కలు నాటారని మిగిలిన మొక్కలు నాటే కార్యక్రమం కూడా కొనసాగుతుందన్నారు. స్వచ్ఛదనం - పచ్చదనం ముగింపులో భాగంగా ఈరోజు రెండు లక్షలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా, ఇరిగేషన్ స్థలాలలో, చెరువులు, నదులలో, అటవీ భూములలో మొక్కలు నాటడానికి అనువైన స్థలాలు గుర్తించి మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగిస్తున్నామన్నారు. చెట్లను నాటడమే కాకుండా, వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు.
భవిష్యత్ తరాల కోసం చెట్లనాటి వాటిని పరిరక్షిస్తే ప్రకృతిని పరిరక్షించినట్లుగా ఆయన పేర్కొన్నారు. మన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పచ్చదనం పెంపు లక్ష్యాలతో ప్రభుత్వం ఆగస్టు 5 నుంచి 9 వరకు స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు పాటించాలని, ఇంట్లోని పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ వస్తువుల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని, ఇల్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుతామో అదే విధంగా మన గ్రామాన్ని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యుత్ లైన్లు, త్రాగునీటి సరఫరా పైప్ లైన్లకు దూరంగా అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటాలని కలెక్టర్ సూచించారు. స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమంలో మంచి ఫలితాలు సాధించాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా మన చుట్టూ ఉండే పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని సూచించారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేయాలన్నారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో తగ్గించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పారిశుధ్య నిర్వహణ పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమం ద్వారా ఆరోగ్య మెదక్ జిల్లా సాధ్యమవుతుందని, ఆ దిశగా మనమంతా కృషి చేయాలని అన్నారు. పాఠశాల విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. విద్యార్థులు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి కలెక్టర్ విద్యార్థుల్ని, ఉపాధ్యాయులని అభినందించారు. ఈ కార్యక్రమంలో, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా అటవీ అధికారి రవికుమార్, డీఆర్డీఏ శ్రీనివాసరావు, తూప్రాన్ ఆర్డీఓ జయ చంద్రారెడ్డి, జిల్లా విద్యా అధికారి రాధా కిషన్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, తూప్రాన్ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి కృష్ణ, మున్సిపల్ కమిషనర్, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.