దిశ ఎఫెక్ట్..కటకటాల్లోకి సిడబ్ల్యూసి మేనేజర్..!
రక్షణగా ఉండాల్సిన అధికారి అక్రమార్జన కోసం పాల్పడి కటకటాల పాలై ఉద్యోగం పోగొట్టుకున్నాడు. సి డబ్ల్యూ సి లో మేనేజర్ గా పని చేస్తున్న కోటేశ్వర్ తో పాటు బియ్యం దొంగతనంగా తరలించిన ఎగ్జిక్యూటివ్ సునీల్

దిశ, మెదక్ ప్రతినిధి : రక్షణగా ఉండాల్సిన అధికారి అక్రమార్జన కోసం పాల్పడి కటకటాల పాలై ఉద్యోగం పోగొట్టుకున్నాడు. సి డబ్ల్యూ సి లో మేనేజర్ గా పని చేస్తున్న కోటేశ్వర్ తో పాటు బియ్యం దొంగతనంగా తరలించిన ఎగ్జిక్యూటివ్ సునీల్, టెక్నికల్ శ్యామ్ ల కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్ తరలించినట్టు పట్టణ సీఐ నాగరాజు తెలిపారు. మెదక్ పట్టణంలోని కేంద్ర గిడ్డంగుల సంస్థలో గత నెల 31 న రంజాన్ సెలవు రోజు ఎలాంటి అనుమతులు లేకుండా వెళుతున్న ఎఫ్ సీ ఐ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సి డబ్ల్యూ సి లో ఇంటి దొంగలు అనే కథనం దిశ పత్రికలో ప్రచురితమైన సంగతి తెలిసిందే.
అక్రమ బియ్యం గా పట్టుకున్న పోలీసులు దిశ పత్రికలో వచ్చిన కథనం తో సమగ్ర విచారణ చేశారు. సి డబ్ల్యూ సి, ఎఫ్ సి ఐ విజిలెన్స్ బృందాలు విచారణ జరిపి మేనేజర్ కోటేశ్వర్ రావు, సిబ్బంది సునీల్, శ్యామ్ లు కలిసి ఎలాంటి అనుమతులు లేకుండా దొంగతనంగా బియ్యం తరలించినట్టు రిపోర్టు అధికారులకు అందజేశారు. సంస్థ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మేనేజర్ కోటేశ్వర్ రావు తో పాటు సునీల్, శ్యామ్ తో పాటు డ్రైవర్ భాను చందర్, సంతోష్ ల పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులైన కోటేశ్వర్ రావు, సునీల్, శ్యామ్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు సీఐ చెప్పారు.
కోటేశ్వర్ రావు సస్పెండ్
మెదక్ సిడబ్ల్యూ సి మేనేజర్ కోటేశ్వర్ రావు ను సస్పెండ్ చేసి ఆయన స్థానంలో భాగ్య రాజ్ ను మెదక్ సిడబ్ల్యూ సి మేనేజర్ గా సంస్థ నియమించింది. శుక్రవారం మెదక్ వచ్చిన ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో మచిలీ పట్నం లో విధులు నిర్వహించినట్టు చెప్పారు.
దిశ వరుస కథనాలతో కదలిక...
సిడబ్ల్యూ సి లో ఇంటి దొంగల ఇంటి గుట్టును దిశ పత్రిక మొట్టమొదటి వెలుగులోకి తెచ్చింది. మేనేజర్ తో పాటు ఇందులో సొంత సంస్థకు చెందిన సిబ్బంది చేతివాటం ప్రదర్శించి ఏళ్లుగా బియ్యం స్వాహా చేస్తున్న వైనం పై విశ్లేషణాత్మక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దిశ పత్రికలో వచ్చిన కథనాలతో సిడబ్ల్యూ సి, ఎఫ్ సి ఐ విజిలెన్స్ బృందాలు మెదక్ వచ్చి విచారణ జరిపి బియ్యం చోరీ జరిగినట్టు నిగ్గు తేల్చారు. గోదాం లో గుట్టుగా సాగుతున్న అక్రమంగా బియ్యం తరలిస్తున్న ఇంటి దొంగల పై వచ్చిన దిశ కథనం అధికారులు ప్రశంసించారు. వరసగా కథనాలు రావడంతో ఇందులో ప్రధాన సూత్రధారులైన అధికారులు ఉద్యోగులు పోగొట్టుకొని జైలు అయ్యారు. అవినీతి అధికారులపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.