చల్లంగా చూడమ్మా.. వనదుర్గమ్మ తల్లి..

దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయం.. జనమేజయుని సర్పయాగ స్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. ఆధ్యాత్మిక వాతావరణం..

Update: 2024-09-29 10:18 GMT

దిశ, పాపన్నపేట : దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయం.. జనమేజయుని సర్పయాగ స్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. ఆధ్యాత్మిక వాతావరణం.. ఆలయం చుట్టూ పచ్చని చెట్లు, బండరాళ్లు, గలగల పారే గంగమ్మ పరవళ్ళు.. ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నామనిపించే అనుభూతి.. ఇది పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ఆదివారం నెలకొన్న వాతావరణం. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వనదుర్గమ్మ దర్శనానికి తరలివచ్చారు. సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదలడంతో వనదుర్గాదేవి ప్రధానాలయం ఆరు రోజులుగా జలదిగ్బంధంలోనే చిక్కుకున్న సంగతి తెలిసిందే.

దీంతో మూలవిరాట్ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం లేకపోవడంతో, రాజగోపురంలో ప్రతిష్టించిన ఉత్సవ విగ్రహాన్ని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు అమ్మవారికి డప్పు చప్పుళ్లు, మేళ తాళాలతో బోనాలు, ఒడిబియ్యం సమర్పించారు. మరికొందరు భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రం హోరెత్తింది. చల్లంగా చూడమ్మా.. వనదుర్గమ్మ తల్లీ అంటూ వేడుకున్నారు. ఆలయ అర్చకులు పూజలు చేపట్టి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. భక్తులు ఆలయ పరిసరాల్లోని షెడ్లు, పచ్చని చెట్ల కింద భోజనాలు చేసి ఇళ్లకు తిరుగుపయనమయ్యారు.


Similar News