సిద్దుల గుట్టకు పోటెత్తిన భక్తులు
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పరిధిలోని పొట్టి పల్లి శివారు ప్రాంతంలో వెలసిన ఆకుపచ్చని చెట్లు, గుట్టల మధ్య అతి పురాతనమైన సిద్దేశ్వర స్వామి వారి జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

దిశ, ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పరిధిలోని పొట్టి పల్లి శివారు ప్రాంతంలో వెలసిన ఆకుపచ్చని చెట్లు, గుట్టల మధ్య అతి పురాతనమైన సిద్దేశ్వర స్వామి వారి జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం 5:30 నిమిషాలకు గ్రామంలోని ప్రధాన రహదారి నుండి సుమారు రెండు కిలోమీటర్ల మేర స్వామివారి పల్లకి సేవ కొనసాగింది. స్వామి వారి ఆలయం చేరుకున్న అనంతరం అభిషేకం, నిత్య పూజలు నిర్వహించి అగ్నిదేవతకు ఆహ్వానం పలికారు. అగ్నిదేవతకు పూజలు నిర్వహించిన అనంతరం పీఠాధిపతులు, భక్తుల మధ్య అగ్నిగుండ ప్రవేశం నిర్వహించారు.
అనంతరం ఆధ్యాత్మిక ధర్మసభ, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహామండలేశ్వర్, బర్దిపూర్ ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి మహారాజ్, సిద్దేశ్వరానందగిరి, ధనశ్రీ, తంగేడుపల్లి, న్యామతాబాద్ పీఠాధిపతులు వీరేశ్వర శివాచార్య, శివయోగి, విశ్వగిరి మహారాజ్ హాజరై భక్తులకు ప్రవచనామృతాన్ని అందించారు. జహీరాబాద్, నారాయణఖేడ్, బీదర్, ఝరాసంగం, న్యాక కాల్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిద్దేశ్వర స్వామి దేవాలయ ట్రస్ట్ సభ్యులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు.