ఎవరిని వదలం..అమీన్ పూర్ అక్రమాల లెక్క తేలుస్తాం: రంగనాథ్

అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో చెరువులు, కుంటలు, వరద కాలువలు, ప్రభుత్వ భూముల కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాలకు పాల్పడిన ఎవరిని వదలమని హెచ్చరించారు.

Update: 2024-08-15 02:29 GMT

దిశ, పటాన్‌చెరు: అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో చెరువులు, కుంటలు, వరద కాలువలు, ప్రభుత్వ భూముల కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాలకు పాల్పడిన ఎవరిని వదలమని హెచ్చరించారు. బుధవారం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు, కొత్త చెరువు, బంధం కొమ్ము చెరువులను ఆయన పరిశీలించారు. మొదట పెద్ద చెరువు వెనకాల శ్రీవాణి నగర్ లో పర్యటించి ఎఫ్​ టీఎల్​, బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం అక్కడ నుంచి పెద్ద చెరువు కట్ట వద్దకు చేరుకున్నారు. పెద్ద చెరువు కు చేరుకున్న కమిషనర్ తూములని పరిశీలించారు. అలుగులెక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. చెరువులో నుంచి నీరు వెళ్లే తూముల మూసివేత పట్ల ఇరిగేషన్ అధికారులపై మండిపడ్డారు. పెద్ద చెరువు తూముల సంఖ్య కోసం డీఈ రామ స్వామిని ప్రశ్నించగా నాలుగు తూములు ఉన్నట్లు కింద పంటలు లేక పోవడంతో తూములు పని చేయడం లేదని వివరించారు. అమీన్ పూర్ పెద్ద చెరువుకు అనుసంధానంగా ఉన్న కొత్త చెరువు అన్యాక్రాంతంపై కమిషనర్ సీరియస్ అయ్యారు. చెరువును పూడ్చివేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

పెద్ద చెరువు అలుగులెక్కడ..?

పెద్ద చెరువు కు చేరుకున్న కమిషనర్ తూములని పరిశీలించారు. అలుగులెక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. చెరువులో నుంచి నీరు వెళ్లే తూముల మూసివేత పట్ల ఇరిగేషన్ అధికారులపై మండిపడ్డారు. పెద్ద చెరువు తూముల సంఖ్య కోసం డీఈ రామ స్వామి ని ప్రశ్నించగా నాలుగు తూములు ఉన్నట్లు కింద పంటలు లేక పోవడంతో తూములు పని చేయడం లేదని వివరించారు. అయితే పక్కనే ఉన్న స్థానికులు పెద్ద చెరువు‌కు 2 అలుగులు, 7 తూములు ఉండేవని సమాధానం ఇచ్చారు. రెండు అలుగుల మాయంతో తూముల మూసివేత పై ఆగ్రహం వ్యక్తం చేసి వరద నీరు బయటకు ఎలా వెళ్లాలని ప్రశ్నలు గుప్పించారు. జీవ వైవిధ్య చెరువు గా గుర్తింపు పొందిన అమీన్ పూర్ పెద్ద చెరువు స్థలాలల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు.పెద్ద చెరువు కింద మరొక చిన్న కుంటను మాయం చేసి బహుళ అంతస్తుల నిర్మాణం చేస్తున్నారని పలువురు కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. అదేవిధంగా చెరువులోకి నీరు బయటకు వెళ్లకపోవడం తో తమ ప్లాట్లు ముంపుకు గురవుతున్నాయని పెద్ద చెరువు ప్లాట్ల బాధితులు చెరువులో నీటిని కిందికి వదలలని కమిషనర్ ను కలిసి విన్నవించుకున్నారు. అనంతరం అక్కడ నుంచి కొత్త చెరువును పరిశీలించారు.

కొత్త చెరువు పూడ్చివేత పై ఆగ్రహం..

అమీన్ పూర్ పెద్ద చెరువు కు అనుసంధానంగా ఉన్న కొత్త చెరువు అన్యాక్రాంతం పై కమిషనర్ సీరియస్ అయ్యారు. చెరువును పూడ్చివేస్తుంటే అధికారులు ఎం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారుల అలసత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త చెరువులో సింహా భాగాన్ని ఆక్రమించి చెరువును మట్టి, రాళ్లతో పూడ్చిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఈ చర్యలకు పాల్పడిన వ్యక్తులు ఎవరైనా ఉపేక్షించబోమని కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్కడ నుంచి బంధం కొమ్ము చెరువును పరిశీలించారు. చెరువు ఆక్రమణలపై బంధం కొమ్ము గ్రామస్తులు కమిషనర్ దృష్టికి తీసుకొని రాగా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కబ్జా చేస్తే కటకటాల్లోకి..

ప్రకృతి సంపద అయిన చెరువులు ప్రజల సంపద అయిన ప్రభుత్వ భూములు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలను చేస్తే సహించబోమని కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఈ కబ్జాలకు పాల్పడిన వారి వివరాలతో పాటు అక్రమ నిర్మాణాలకు సహకరించిన అధికారుల చిట్టాను సేకరిస్తున్నామని వెల్లడించారు. కొత్త చెరువు పూడ్చివేత సమయంలో చూస్తూ కూర్చుని పూర్తిగా సహకరించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కబ్జాలకు పాల్పడ్డ అక్రమార్కులతో పాటు సహకరించిన అధికారులపై సైతం క్రిమినల్ కేసులు నమోదు చేసి తప్పు తేలితే అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు.

అమీన్పూర్ అక్రమాల గుట్టు తేల్చేందుకు చెరువుల విస్తీర్ణం ప్రభుత్వ భూముల ఆక్రమణలను తేల్చేందుకు 100 మంది ఇంజనీర్ నిపుణులతో గూగుల్ మ్యాప్ తో చెరువుల విస్తీర్ణం వివరాలు సేకరిస్తామని, దాని కోసం కొత్త టెక్నాలజీని ని తయారు చేస్తున్నామని అవసరమైతే ఐఐటీ విద్యార్థుల సహాయాన్ని తీసుకుంటామని తేల్చి చెప్పారు. అమీన్ పూర్ లో మరిన్ని పర్యటనలు చేసి అక్రమాలను గుర్తిస్తామని పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, నీటిపారుదల శాఖ డీఈఈ రామ స్వామి, ఏ ఈ ఈ సంతోషిణి, టౌన్ ప్లానింగ్ అధికారి పవన్ తో పాటు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.


Similar News