అన్ని గ్రంథాల కంటే భారత రాజ్యాంగం గొప్పది : ప్రజా గాయకుడు గద్దర్
భగవద్గీత, బైబిల్, ఖురాన్, ఇతర గ్రంథాల కంటే భారత రాజ్యాంగం గొప్పదని ప్రజా గాయకుడు, యుద్ధ నౌక గద్దర్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, మాజీ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి అన్నారు.
దిశ, మనోహరాబాద్ : భగవద్గీత, బైబిల్, ఖురాన్, ఇతర గ్రంథాల కంటే భారత రాజ్యాంగం గొప్పదని ప్రజా గాయకుడు, యుద్ధ నౌక గద్దర్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, మాజీ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కాళ్లకల్ లో దాతల సహకారంతో ఎమ్మార్పీఎస్, అరుంధతి బంధు సేవ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు.
నిర్వాహకులు మురళి, రమేష్, కుమార్, స్థానిక సర్పంచ్ నత్థి మల్లేష్ ముదిరాజ్ ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం యావత్ ప్రపంచానికే మార్గదర్శకమని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను, ఆయన రచించిన రాజ్యాంగంలో పొందు పరిచిన అంశాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులపై ఉందన్నారు. ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో సూచించిన విధంగా కూడు, గూడు, గుడ్డ అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
గడిచిన 75 ఏళ్ల భారత స్వాతంత్ర్య చరిత్రలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయాలన్నారు. అంబేద్కర్ దళితులకే నాయకుడు కాదని దేశంలోని అన్ని కులాలకు, మతాలకు, ప్రతి వ్యక్తికి నాయకుడని అన్నారు. ప్రతి వ్యక్తికి భారత రాజ్యాంగం ఒక ఆయుధమని తెలిపారు. అంతకు ముందు గద్దర్ తో పాటు ప్రజా గాయకుడు అశోక్, ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు మాసాయిపేట యాదగిరి బృందం పాటలను పాడి ప్రజలను చైతన్యవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం కన్వీనర్ చిటుకుల మహిపాల్ రెడ్డి, ఉమ్మడి మండల సొసైటీ అధ్యక్షుడు మెట్టు బాలకృష్ణారెడ్డి, ఎంపీటీసీ నత్థి లావణ్య, రంగాయిపల్లి సర్పంచ్ నాగభూషణం ముదిరాజ్, రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ ముదిరాజ్, పురం రవి ముదిరాజ్, మండల యూత్ వింగ్ అధ్యక్షుడు రాహుల్ రెడ్డి, జిల్లా, మండల ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు రేణుకుమర్, ధర్మేంద్ర ముదిరాజ్, ఎమ్మార్పీఎస్ నాయకులు, దళిత నాయకులు, తదితరులు పాల్గొన్నారు.