డిసెంబర్ 3న అధికారంలోకి వస్తున్నాం..
కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం సాధ్యపడుతుందని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
దిశ, పటాన్ చెరు: కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం సాధ్యపడుతుందని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో నవ్య నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని ఇసుక బావిలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి గడపకు సంక్షేమం ప్రతి గల్లీకి అభివృద్ధి ఫలాలు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో పాటు యువకులు, రైతుల తో పాటు అన్ని వర్గాల ప్రజలకు పలు డిక్లరేషన్‌లను ప్రకటించిందన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ అవినీతి అరాచకాలకు ప్రజలు విసిగి పోయారని విమర్శించారు. ప్రజల స్వేచ్ఛను హరించడమే కాకుండా జవాబు దారి తనం లేదన్నారు. గతంలో రాజకీయాల్లో విలువలు ఉండేవని కానీ ప్రస్తుత కేసీఆర్ సర్కార్ లో రౌడీలు, గుండాలు రాజ్యమేలుతున్నారని ఘాటు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పటాన్ చెరు లో కబ్జాదారులు రెచ్చిపోయి అమాయకుల భూముల్ని కొల్లగొడుతున్నారని, డిసెంబర్ 3న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఇక్కడి ప్రజలు నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించిన మరుక్షణం రౌడీల భరతం పడతానని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అధికారంలో వచ్చిన 100 రోజుల్లోపు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలంతా మరో మారు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ని బలపర్చి నిరంతరం ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ లో యువకుల చేరిక
అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వాణి నగర్ కి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రవి గౌడ్ ఆధ్వర్యంలో 60 మంది యువకులు కాటా శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికి కండువా వేసి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విరివిగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, మండల అధ్యక్షుడు అశోక్, మున్సిపాలిటీ జనరల్ సెక్రటరీ సుధాకర్ యాదవ్, కౌన్సిలర్లు లావణ్య శశిధర్ రెడ్డి, సునీత, మున్నా లతో పాటు పలు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.